సూర్యాపేట టౌన్ : ప్రజా సమస్యలను చట్టపరంగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీనరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుదారులను నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు, సూచనలు చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు.
డ్రగ్స్ నిర్మూలన, పిల్లల భద్రత
అందరి బాధ్యత
డ్రగ్స్ నిర్మూలన, పిల్లల భధ్రత అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేటలో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలల భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీసు అధికారులు విద్యార్థులు, యువతకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారన్నారు. ఈ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మే 2వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. బాలల భద్రతను పర్యవేక్షించడం, వ్యసనాలకు అలవాటుపడ్డ వారిలో మార్పు తేవడం, నేటి యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుండి పారదోలడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా మాదక ద్రవ్యాల విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
జిల్లా ఎస్పీ నరసింహ


