పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌..

Apr 27 2026 8:42 AM | Updated on Apr 27 2026 8:42 AM

సూర్యాపేట టౌన్‌ : నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలపై విద్యా శాఖ ముందస్తుగానే దృష్టి సారించింది. ఇప్పటికే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. నెలన్నర తర్వాత బడులు తెరుచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థుల చేతుల్లో పాఠ్య పుస్తకాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 72.87శాతం పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. మిగిలిన పుస్తకాలు కూడా త్వరలోనే రానున్నాయి.

జిల్లాకు 3,41,350 పుస్తకాలు అవసరం

జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 60వేల మంది విద్యార్థులకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి 3,41,350 పుస్తకాలు అవసరమని విద్యా శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు 2,48,770(72.87శాతం) పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలోని గోదాములో భద్రపరుస్తున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ మీడియం పుస్తకాల పంపిణీ దృష్ట్యా ఏడాదిలో రెండు విడతల్లో పార్ట్‌ 1, పార్ట్‌ 2గా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తూ విడతల వారీగా సరఫరా చేస్తున్నారు. ప్రతి పుస్తకంపై వరుస సంఖ్య, కూ ఆర్‌ కోడ్‌ను ముద్రించడంతో ఉచిత పుస్తకాలు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఏ వరుస సంఖ్య పుస్తకాలు ఏ పాఠశాలకు వెళతాయనే అంశాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయనున్నారు.

జూన్‌ మొదటి వారంలో పంపిణీ

విద్యార్థులకు అందించాల్సిన పుస్తకాలు మే నెలలో పూర్తి స్థాయిలో గోదాముకు రానున్నాయి. ఈ పుస్తకాలను జూన్‌ మొదటి వారంలో మండలంలోని ఎమ్మార్సీలకు పంపించి అక్కడి నుంచి సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థుల చేతుల్లో కొత్త పాఠ్య పుస్తకాలు ఉండేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ముందస్తు బడిబాట సైతం నిర్వహిస్తున్నారు. ఈ బడిబాటలో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులను, బడిబయట విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నారు.

ఫ ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరిన 72.87 శాతం

ఫ జెడ్పీ బాలుర పాఠశాల గోదాములో భద్రపరిచిన అధికారులు

ఫ పాఠశాలలు పునఃప్రారంభం

రోజే అందజేసేందుకు ఏర్పాట్లు

పాఠశాలల పునఃప్రారంభం

రోజే పంపిణీ చేస్తాం

విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తాం. విడతల వారీగా పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. ఇప్పటికే 72శాతం పుస్తకాలు వచ్చాయి. మిగతావి కూడా త్వరలోనే వస్తాయి. వచ్చిన వాటిని గోదాములో నిల్వ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత జూన్‌ మొదటి వారంలో ఎంఈఓల ఆధ్వర్యంలో సంబంధిత పాఠశాలలకు అందజేస్తాం.

– అశోక్‌, జిల్లా విద్యా శాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement