అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు.
బాధితుల ఇంటి నుంచే కేసులు నమోదు
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే బాధితుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఇంటి వద్ద నుంచే కేసు నమోదు చేస్తున్నామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాధితుల ఇంటి వద్ద నుంచే కేసు నమోదు, ఎఫ్‌ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా అమలు చేస్తోందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి, బాధితుల ఇంటికి పోలీసు అధికారులు చేరుకుని పారదర్శకంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా బాధితుల ఇంటి నుంచి 101 కేసులు నమోదు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఆకృత్యాలు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, బాల్య వివాహాలు జరిగే సమయంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇంటి వద్దకు, లేదా వారికి అనుకూలమైన ప్రదేశంలో ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి పత్రాన్ని అందజేస్తున్నామన్నారు. సమస్యలపై 100 నంబర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు.
డ్రగ్స్ నిర్మూలనపై
నేటి నుంచి అవగాహన
సూర్యాపేట టౌన్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 5వ అంశం పిల్లల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, యువత మత్తుకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారని, వాటి బారినుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. గంజాయి సరఫరా, వినియోగంపై, గతంలో గంజాయి కేసుల్లో ఉన్న వారిపై, వినియోగించే వారిపై పోలీసు నిఘా ఉంచామని తెలిపారు. వీరికి కౌన్సిలింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిసామని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత భాగస్వామ్యం కావాలని, మాదకద్రవ్యాల రహిత ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.


