భానుపురి (సూర్యాపేట) : జనగణన –2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణనకు అవకాశం కల్పించామని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వీయ గణనపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా స్వీయ గణన నమోదు ప్రక్రియను వివరించారు. మే 10వరకు ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ప్రజలు తమ ఇంటి, కుటుంబ సభ్యుల సమాచారం, సౌకర్యాలు మొదలైన అంశాలను అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా నమోదు చేయవచ్చన్నారు. జనగణనలో మొదటి సారిగా స్వీయ గణనను ప్రవేశపెట్టడం దేశాన్ని డిజిటల్ దిశగా తీసుకెళ్లే ప్రక్రియలో ముఖ్యమైన అడుగు అన్నారు. ప్రతి కుటుంబం తప్పకుండా స్వీయ గణనలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఎస్‌ఓ ఇస్లావత్ ఓబులాలు, ఎస్‌ఓవి రామారావు, ఎం.రాజేష్, తదితరులు పాల్గొన్నారు.


