‘ఎన్‌ఎఫ్‌బీఎస్‌’ బాధ్యతల మార్పు | - | Sakshi
Sakshi News home page

‘ఎన్‌ఎఫ్‌బీఎస్‌’ బాధ్యతల మార్పు

Apr 27 2026 8:42 AM | Updated on Apr 27 2026 8:42 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : పేద కుటుంబాల్లో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్‌) నిర్వహణ బాధ్యతల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఈ పథకం బాధ్యతలను చూస్తున్న రెవెన్యూ శాఖ (తహసీల్దార్లు) నుంచి తొలగించి ఇకపై ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్ల పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జాప్యానికి చెక్‌ పెట్టేందుకే..

ఇప్పటివరకు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే బాధిత కుటుంబాలు తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. అయితే, రెవెన్యూ అధికారులపై ఉన్న పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయి విచారణలు, నివేదికల తయారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల లబ్ధిదారులకు సకాలంలో సాయం అందడం లేదని భావించి, పాలనను ప్రజలకు మరింత దగ్గర చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త దరఖాస్తు విధానం

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై లబ్ధిదారులు తమ దరఖాస్తులను నేరుగా గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో వార్డు ఆఫీసర్‌ కార్యాలయంలో సమర్పించవచ్చు. పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఎంపీడీఓలకు నివేదికలు అందజేస్తారు. ఈ నివేదికల ఆధారంగా ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు నిధులను మంజూరుకు నివేదిస్తారు. దీనివల్ల బాధితులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పనుంది.

అర్హతలు, ప్రయోజనం

కుటుంబానికి ఆధారమైన వ్యక్తి 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు ఉండి మరణించి ఉండాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్‌) కుటుంబాల వారు మాత్రమే దీనికి అర్హులు. అర్హత పొందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20వేల నగదు సాయాన్ని ఒకేసారి అందిస్తుంది. ప్రభుత్వం కొత్త నిబంధన చేయడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకోవచ్చు. మంజూరైన నిధులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ఫ మండలాల్లో ఎంపీడీఓలకు,

పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లకు..

ఫ రెవెన్యూ అధికారులపై పని ఒత్తిడి తగ్గించేలా నిర్ణయం

ఫ సాయం పంపిణీలో జాప్యాన్ని

నివారించేలా ప్రణాళిక

Advertisement
 
Advertisement
Advertisement