కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదు
భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె వీడడం లేదు. అధికారులు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సూర్యాపేట జిల్లాకేంద్రంతోపాటు కోదాడలోని ఆర్టీసీ డిపోల ముందే కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కడ లేదు. కేవలం ఎలక్ట్రిక్, అద్దె బస్సులు మాత్రమే డిపో దాటి రోడ్డెక్కుతున్నాయి. అయితే సమ్మెకు చాలామంది డ్రైవర్లు, వివిధ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు తరలివచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు. మూడో రోజు సూర్యాపేట, కోదాడ డిపోల వద్ద సమ్మె చేపట్టారు. సమ్మె నేపథ్యంలో నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన శంకర్‌గౌడ్ చిత్రపటానికి ఇరు చోట్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నాలు జరుగుతుండడంతో అధికారులు పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో మొత్తం 170 బస్సులు ఉండగా కేవలం 60 బస్సులను మత్రమే అధికారులు నడిపించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ల కోసం ప్రభుత్వం నియామకాలు జరుపుతుందన్న ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేసేందుకు యత్నిస్తున్నారు.
వివిధ సంఘాల మద్దతు
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శుక్రవారం మద్దతు తెలిపి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన న్యాయబద్ధమైనదని, కార్మికుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కార్మికులు ఉద్యోగులు సహనం కోల్పోవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి కానీ ఎవరు ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడొద్దన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు చేసిన కృషిని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. పిఆర్సి చట్టబద్ధంగా అమలు చేసే అంశం కాబట్టి ప్రభుత్వానికి ఇబ్బందులుఉండబోవని చెప్పారు. అలాగే కోదాడ బస్ డిపో గేటు ఎదుట ఆర్టీసీ కార్మికులు ఽనల్లబ్యాడ్జీలతో మౌన నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరి సమ్మెకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిర్లక్ష్యం చేయడం సరికాదని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్టీసీ డిపో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు ఆయన కార్మికులకు సంఘీభావం తెలిపే మాట్లాడారు. కార్మికులకు తమ మద్దతు ఉంటుందని వారి హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఫ వివిధ పార్టీలు,
కార్మిక సంఘాల మద్దతు
ఫ రోడ్డెక్కని బస్సులు..
ప్రయాణికుల తిప్పలు


