తిరుకల్యాణోత్సవ ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

తిరుకల్యాణోత్సవ ఏర్పాట్ల పరిశీలన

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేతరంలో ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు జరగనున్న తిరుకల్యాణోత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లను శుక్రవా రం హుజూర్‌నగర్‌ ఆర్డీఓ శ్రీనివాసులు, కోదా డ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పార్కింగ్‌ స్థలం, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, సీఐ చరమందరాజు, తహసీల్దార్‌ మంగారాథోడ్‌, సర్పంచ్‌ విజయశాంతిఅప్పారావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

పెన్‌పహాడ్‌ : నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీడీ పవన్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని సింగారెడ్డిపాలెంలో నర్సరీని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా నిర్వాహకులు ప్రతి రోజు నీరు అందించాలని సూచించారు. నర్సరీల నిర్వహణపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో తిరిగి విత్తనాలు నాటాలన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ ఒగ్గు కిరణ్‌, ఏపీఓ రవి, పంచాయతీ కార్యదర్శి అఖిల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ జ్యోతి ఉన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

అర్వపల్లి : జిల్లాలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 141 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 135 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా సహకార అధికారి పాల్వాయి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం సూర్యానాయక్‌తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ భాషపాక శ్రీకాంత్‌, గిర్దావర్‌ పాటి వెంకట్‌రెడ్డి, నిర్వాహకులు ఉన్నారు.

అందుబాటులో

80 టన్నుల జిప్సం

చిలుకూరు : మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు 80 టన్నుల జిప్సం అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయాధికారి శ్రీధర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక టన్ను జిప్సం ధర సబ్సిడీ పోను రూ.534 అని తెలిపారు. చౌడు భూముల్లో జిప్సం చల్లడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. జిప్సం కావాల్సిన చిలుకూరు మండలానికి చెందిన రైతులు తమ పట్టాదారు పాస్‌పుస్తకాలతో ఏఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement