సూర్యాపేట : వాసవి సేవాసమితి సహకారంతో ఈ నెల 26 నుంచి మే 10 వరకు సూర్యాపేటలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తంతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం వేసవిలో విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగాతో విద్యార్థుల మేథాశక్తి పెంపొందుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించే యోగా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో వాసవి సేవాసమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్‌కుమార్, పట్టణానికి చెందిన యోగా సాధకులు పాల్గొన్నారు.
కూలీలందరికి ఉపాధి పనులు కల్పించాలి
పాలకవీడు : అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులను చేపట్టి కూలీలకు పనులు కల్పించాలని అసిస్టెంట్ డీఆర్‌డీఓ యామిని ఆదేశించారు. పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడి పనుల వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు గరిష్ట వేతనం రూ.307 అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నందున ఉదయం 7 గంటలకు పనులకు హాజరై 11 గంటల లోగా ముగించుకోవాలని సూచించారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ వంటి సదుపాయాలు కల్పించాలని పంచాయతీ కార్యదర్శి వినయ్‌ను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, ఉపాధిహామీ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్‌కు దరఖాస్తులు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం బాలెంలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్), బీకాం (కంప్యూటర్స్, జనరల్) బీఎస్సీ (మ్యాథ్స్, సైన్స్, మైక్రో బయాలజీ) గ్రూపులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థినులు సంబంధిత సర్టిఫికెట్స్‌తో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ 7995010681 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
గురుకులాల్లో
మెనూ అమలు చేయాలి
తుంగతుర్తి : హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా సివిల్ సప్లై డీఎం శ్రీధర్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో అందిస్తున్న విద్య, వారి ప్రగతి, స్నాక్స్ ఇస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.


