ఆన్‌లైన్‌లో విద్యార్థుల ప్రోగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో విద్యార్థుల ప్రోగ్రెస్‌

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రగతిని ఆన్‌లైన్‌లో ఉంచేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. 2025–26 విద్యాసంవత్సరం గురువారంతో ముగియనుండగా ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి విద్యార్థులకు ప్రొగ్రెస్‌ కార్డులు అందించనున్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ఈ నెల 18న ముగియగా, విద్యార్థుల మార్కుల జాబితాలను ఉపాధ్యాయుల ద్వారా సేకరించిన సీఆర్పీలు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియను పూర్తి చేశారు.

ఆన్‌లైన్‌లోనే వివరాలన్నీ

సూర్యాపేట జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 50వేల మంది విద్యార్థులు ఈ సంవత్సరం విద్యనభ్యసించారు. ఇప్పటి వరకు నిర్వహించిన నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక, మూల్యాంకనానికి సంబంధించిన ఫలితాలను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఉన్నత పాఠశాలల్లో సమ్మేటివ్‌–2 పరీక్షలు పూర్తి కావడంతో వాటిలో విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రగతి పత్రంలో విద్యార్థి, పాఠశాల వివరాలు, విద్యార్థుల ప్రతిభకు సంబంధించిన వివరాలన్నీ ఉంచారు. దాంతో విద్యార్థి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. విద్యార్థి వివరాలు నమోదు చేయగానే ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా ప్రొగ్రెస్‌ రిపోర్టులు జనరేట్‌ అవుతున్నాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసి ప్రింట్‌ తీసుకుంటారు. గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని వివరిస్తారు. అనంతరం విద్యార్థుల ప్రగతి పత్రాలను అందజేయనున్నారు.

నేడు కార్డులు అందజేత

విద్యాసంవత్సరం చివరి రోజైన గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల చదువు ఎలా సాగింది.. వారు చదువుతో పాటు మిగతా విషయాల్లో ఎలా రాణించారు.. అనే విషయాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించనున్నారు. భవిష్యత్‌ లక్ష్యాలు, వాటిని అధిగమించేందుకు ఎలా సన్నద్ధం కావాలి వంటి అంశాలను కూడా వివరిస్తారు.

ఫ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రగతి వివరాలు

ఫ నేడు తల్లిదండ్రులతో సమావేశాలు

ఫ జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు

Advertisement
 
Advertisement
Advertisement