సూర్యాపేటటౌన్ : బాధితుల సమస్యలకు చట్టపరమైన తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు బరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు జాతీయస్థాయి అవార్డులు
సూర్యాపేట : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించినట్లు చివ్వెంల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జి. విద్యాసాగర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ద డ్రీమ్ నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ ఆఫ్ మహారాష్ట్రలో ఆరు విభాగాలలో పాఠశాల విద్యార్థులు పాల్గొని 22 గోల్డ్ మెడల్స్, స్టార్ అవార్డ్స్ సాధించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, ఆర్ట్ టీచర్ చింతలపాటి ప్రవీణ్‌కుమార్‌కు కూడా సంస్థ వారు నేషనల్ గ్లోబల్ అచీవ్‌మెంట్ అవార్డు అందించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాఠశాలలో కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు అవార్డులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడికి పూజలు
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుపర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శివాలయంలోని పార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు.


