అసమానతలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

అసమానతలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

భానుపురి (సూర్యాపేట) : మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయన ఆశయాలను అనుసరించి సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు (మినీ ట్యాంక్‌ బండ్‌) వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను ప్రచారం చేసిన మహనీయుడని కొనియాడారు. చదువు గొప్పతనాన్ని గుర్తించి దానిని ప్రజల్లోకి చదువు తీసుకెళ్లాలన్న ఆలోచనతో పాటల, రచనల ద్వారా చైతన్యం కలిగించారన్నారు. ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమన్నారు. లింగ, బలిజ కమ్యూనిటీ కోసం అవసరమైన భూమిని కేటాయించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మొరిశెట్టి నివేదిత, వైస్‌ చైర్మన్‌ షఫీ ఉల్లా, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్‌రెడ్డి, వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి నరసింహ, తహసీల్దార్‌ కృష్ణయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతరెడ్డి, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ గట్టు శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, టీఎన్జీఓస్‌ జిల్లా సెక్రెటరీ దున్న శ్యామ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్‌ అలి, వీరశైవ లింగాయత్‌ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు వళ్లెం శేఖర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, బీసీ వెల్ఫేర్‌ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement