పట్టాలు, మిషన్‌లు వెనక్కి రాలేదు
పునాదులకే పరిమితమైన ఇంటి గ్రేటెడ్ మార్కెట్
ఫ కోదాడ మార్కెట్‌లోని పట్టాలు, తేమ యంత్రాలు మాయం
ఫ ఒక్క సీజన్‌కే మూలనపడ్డ డ్రయ్యర్
ఫ ఉద్యోగిని సస్పెండ్ చేసిన అధికారులు
కోదాడ : రైతుల ప్రయోజనార్ధం ఏర్పాటు చేసిన కోదాడ వ్యవసాయ మార్కెట్‌తో రైతులకు పెద్దగా ప్రయోజనం కలుగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌కు కోట్ల రూపాయల ఆదాయం, పూర్తిస్థాయి పాలకవర్గం, అధికారులు ఉన్నప్పటికీ కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. మార్కెట్‌లో ఉండాల్సిన ధాన్యం ఆరబోసే పట్టాలు, తేమ చూసే యంత్రాలు కనిపించడం లేదు. రూ.లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన డ్రయ్యర్ ఒక్క సీజన్‌కే మూలన పడింది. అధికారులు ఇందుకు బాధ్యుడిని చేస్తూ ఉద్యోగిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.
రైతు ప్రయోజనాలు శూన్యం
పట్టణ నడిబొడ్డున ఉన్న కోదాడ వ్యవసాయ మార్కెట్‌కు విశాలమైన ఆవరణ, గోదాములు, కార్యాలయం ఉన్నాయి. మార్కెట్‌కు సెస్ రూపంలో సంవత్సరానికి రూ.4 నుంచి రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నది. అయినా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడంలో వెనుకబడినట్లు విమర్శలున్నాయి. మార్కెట్‌లో కేవలం ఆదివారం పశువుల సంత తప్ప ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదు. రైతులను మిల్లర్లు దోచుకుంటున్నా పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.
విచారణ చేసి..
కోదాడ మార్కెట్ ద్వారా రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి పట్టాలను, తేమ చూసే యంత్రాలను కొనుగోలు చేసి గత సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపణీ చేశారు. వీటిలో చాలా వాటిని మార్కెట్‌లో పని చేసే ఓ ఉద్యోగి మాయం చేశాడనే ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేసి ఇటీవల సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. వాటిలో కొన్నింటిని రికవరీ చేయగా మరికొన్ని కనిపించడం లేదని సమాచారం. స్వీపింగ్ కాంట్రాక్టర్‌ను తొలగించి అడపాదడపా అడ్డా కూలీలతో మార్కెట్ ఆవరణను క్లీన్ చేయిస్తూ భారీ ఎత్తున బిల్లులు డ్రా చేస్తున్నారని కొందరు మార్కెట్ డైరెక్టర్లే ఆరోపిస్తున్నారు. ప్రతి ఆదివారం జరిగే పశువుల సంత కోసం వచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలున్నాయి.
రిపేరులో డ్రయ్యర్
గత వానకాలం సీజన్‌లో ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని నిర్వాహకులు కొనుగోళ్లకు నిరాకరించడంతో అనేక చోట్ల రైతులు ఆందోళనలు చేశారు. దాంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ అధికారులు సుమారు రూ.10 లక్షలతో డ్రయ్యర్ (ధాన్యం ఆరబెట్టే యంత్రం) కొనుగోలు చేశారు. దీనిని వినియోగించేందుకు ఖర్చు విపరీతంగా వస్తుండడంతో రైతులు గత సీజన్‌లో పెద్దగా ఆసక్తి చూపలేదు. దానికి తోడు ఈ యంత్రం అప్పుడే రిపేర్‌కు వచ్చింది. బాగు చేయించకుండా యంత్రాన్ని తీసుకొచ్చి మార్కెట్ కార్యాలయం ముందు పడేశారు. అది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతోంది.
వానకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పట్టాలు, తేమశాతం కొలిచే మిషన్‌లను ఇచ్చాము. వాటిలో కొన్ని వెనక్కి రాలేదు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. త్వరలో పూర్తిగా రికవరీ చేస్తాం. డ్రయర్ రిపేరుకు రావంతో పక్కన పెట్టాం. స్వీపింగ్ కాట్రాక్టర్ పెద్దగా అవసరం లేక పోవడంతో రద్దు చేశాం. దీనివల్ల మార్కెట్‌కు ఖర్చు తగ్గింది.
రాహూల్, మార్కెట్ కార్యదర్శి
పట్టణంలో కూరగాయలు, మాంసం విక్రయాలు ఒకే చోటు నిర్వహించేందుకు గానూ గత ప్రభుత్వ హయంలో అక్టోబర్ 31, 2021న కోదాడ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.7.20 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులను మొదలు పెట్టిన కాంట్రాక్టర్ పిల్లర్ల వరకు పూర్తి చేశాడు. అయితే సకాలంలో బిల్లులు రావడం లేదని పనులను ఆపేశాడు. ఈలోగా కొత్త ప్రభుత్వం రాగా దీనిగురించి పట్టించుకునే వారు లేక పనులు ముందుకు సాగడం లేదు. దాంతో మార్కెట్‌లో రెండు ఎకరాల స్థలం ఐదేళ్లుగా నిరుపయోగంగా మారింది.


