ఓపెన్‌ ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ : ఎస్పీ

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

సూర్యాపేటటౌన్‌ : జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ 2023 సెక్షన్‌ అమలు చేయనున్నట్లు ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు.

సూర్యక్షేత్రంలో పూజలు

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్‌, గణపురం నరేష్‌, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

22న సీఐటీయూ జిల్లా స్థాయి సమావేశం

పెన్‌పహాడ్‌ : ఈ నెల 22న సూర్యాపేటలో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ తెలిపారు. ఆదివారం మండలంలోని పొట్లపహాడ్‌ గ్రామంలో నిర్వహించిన సీఐటీయూ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సమన్వయ కమిటీ గ్రామ కన్వీనర్‌గా గంగారపు వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో గంగారపు వెంకన్న, నారాయణ ప్రమీల, గొబ్బి శ్రీకాంత్‌, ఆదిమల్ల రాములమ్మ, మంజుల పాల్గొన్నారు.

వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించడం లేదని రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నెమ్మకల్‌లో నిర్వహించిన రైతు సంఘం జిల్లా మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కనీసం ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, కేవలం 3.4శాతం మాత్రమే ఇస్తుందన్నారు. దేశంలో 50 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, చిన్న సన్న కారు రైతులకు వ్యవసాయ పరికరాలను అందించాల్సి ఉన్నా అవేవీ పట్టించుకోవడం లేదన్నారు. విత్తన రంగం ప్రైవేటు కంపెనీల చేతిలోకి వెళ్లిందన్నారు. ఆయా కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో నాణ్యతలేని విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాసభలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి, నాయకులు మల్లు నాగార్జున్‌రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, రజిత శేఖర్‌రావు, కందాల శంకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ములకలపల్లి రాములు, కోట గోపి, అవిరే అప్పయ్య, దండ వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు కోదాడ విద్యార్థి

కోదాడ రూరల్‌ : కోదాడలోని తేజ విద్యాలయ విద్యార్థి పశ్య జతిన్‌రెడ్డి రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ రమా సోమిరెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యా పేటలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్‌–11 చెస్‌ పోటీల్లో జతిన్‌రెడ్డి పాల్గొని ఐదు రౌండ్లలో ఐదు పాయింట్లు సాధించి చాంపియన్‌గా నిలిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు కోచ్‌ కొండా నరసింహారావు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement