ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట), నూతనకల్ : జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శనివారం ఆత్మకూర్(ఎస్)మండలంలోని నెమ్మికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నూతనకల్ మండలం గుండ్లసింగారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు వ్యవసాయ, సివిల్ సప్లయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మౌళిక వసతులు కల్పించడంతో పాటు తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు అందించినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఒక్కరోజే 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రానున్న రోజులలో మరింత వేగవంతం చేసి రోజుకు 5 వేల నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలుకు అనుగుణంగా లారీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం వేళల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చామని, కొనుగోలు కేంద్రంలో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆయన వెంట డీసీఓ ప్రవీణ్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌ఓ మోహన్‌బాబు, తహసీల్దార్లు అమీన్‌సింగ్, శ్రీనివాసరావు, ఎంపీడీఓలు హసీం, సునీత, ఏఓ దివ్య, సర్పంచ్ జటంగి గణిత, నూతన్‌కల్ మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మహేశ్వరం మల్లికార్జున్, సరితకృష్ణ ఉన్నారు.
ఫ రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


