గృహప్రవేశమైనా.. వనవాసమేనా! | - | Sakshi
Sakshi News home page

గృహప్రవేశమైనా.. వనవాసమేనా!

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

డబుల్‌ బెడ్‌రూం

లబ్ధిదారుల ఆవేదన

మంత్రిగారూ పట్టించుకోరా..

కోదాడ : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్‌ వద్ద గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల సమస్య నేటికీ పరిష్కారానికి నోచలేదు. మూడున్నరేళ్ల క్రితం ఇళ్ల నిర్మాణం పూర్తికాగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం గృహ ప్రవేశాలు కూడా చేశారు. అయితే వసతులు కల్పించాక రమ్మంటూ చెప్పిన అధికారులు.. ఇప్పటికీ వాటిని పూర్తి చేయక, లబ్ధిదారులను ఇళ్లల్లోకి రానివ్వక ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరైనా వెళితే పోలీసు కేసులు పెడుతున్నారు. తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్తామంటే పోలీసులు కేసులు పెట్టడం ఏమిటో అర్థం కాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం మాత్రం కానరావడం లేదు.

10 శాతం పనులు పెండింగ్‌...

కోదాడ పట్టణంలోని నిరుపేదల కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020లో బాలాజీనగర్‌ వద్ద రూ. 42 కోట్లతో 542 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయానికి శంఖుస్ధాపన చేసింది. అనేక అడ్డంకులను దాటుకొని 2023 నాటికి వీటి నిర్మాణం పూర్తయ్యింది. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఇందుకు రూ. 80 లక్షలు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇదే సమయంలో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయడంతో నాటి మంత్రి జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహ ప్రవేశ కార్యక్రమాన్ని హడావుడిగా నిర్వహించారు. అయితే విద్యుత్‌ సౌకర్యంతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధ లేక పోవడంతో లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లడానికి కొంత కాలం ఆగాలని అధికారులు చెప్పడంతో వారు తిరిగి వచ్చారు.

నేటికీ అదే పరిస్థితి

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లోకి లబ్ధిదారులను అనుమతించడానికి కేవలం విద్యుత్‌ సౌకర్యంతో పాటు డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ పనులు పెండింగ్‌లో పెట్టారు. ఆ తరువాత ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. అయితే కాలనీలో వసతులకు రూ.80 లక్షలు అవసరమవుతాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా.. జిల్లా కలెక్టర్‌ వద్ద అత్యవసర నిధులు ఉంటాయని, వాటితోనైనా పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. రూ.42 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం కేవలం రూ.80 లక్షలు కేటాయించక పోవడంతో 542 మంది పట్టణ పేదల సొంత ఇంటి కల నెరవేరడం లేదు. రెండున్నర ఏళ్లుగా వారు ఎదురు చూస్తున్నారు. ఇటీవల కొందరు బలవంతంగా తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని కేసులు పెడతామని హెచ్చరించడంతో ఆగిపోయారు.

ఫ కోదాడ శివారులో బాలాజీనగర్‌లో

రూ.42 కోట్లతో నిర్మాణం

ఫ మూడేళ్ల క్రితం లబ్ధిదారుల ఎంపిక, గృహ ప్రవేశాలు

ఫ విద్యుత్‌, రోడ్డు వసతి కోసం

రెండున్నరేళ్లుగా నిరీక్షణ

ఫ ప్రస్తుతం ఇళ్లలోకి వెళితే కేసులు

పెడుతున్న అధికారులు

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలు తనకు రెండు కళ్ల వంటివని చెబుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ సమస్యను పట్టించుకోవాలని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు కోరుతున్నారు. హుజూర్‌నగర్‌లో వందల కోట్ల రూపాయలను మంజూరు చేసి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్న మంత్రి కోదాడ ఇళ్ల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయంలో జరిగిన లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోవడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇదే నిజమైతే ప్రభుత్వం మరోసారి విచారణ జరిపి అనర్హులుంటే తొలగించి నిజమైన వారికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement