హీమోఫీలియోపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

హీమోఫీలియోపై అవగాహన అవసరం

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

సూర్యాపేటటౌన్‌ : హీమోఫీలియో వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన క్లాటింగ్‌ ఫ్యాక్టర్ల లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. చిన్నపిల్లల్లో తరచూ రక్తస్రావం, గాయాలు ఎక్కువ కాలం మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కార్యకర్తలు గుర్తించి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బ్లడ్‌ సెల్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ కోటి రత్నం, వైద్యులు ప్రసిద్ధి శ్రీశైలం, సత్తయ్య, శ్రీదేవి, ఉపేందర్‌, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా శ్యామ సుందర్‌

హుజూర్‌నగర్‌ : హుజూ ర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎన్‌. శ్యామ సుందర్‌ను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేసిన రాధాకృష్ణ చౌహాన్‌ పదోన్నతిపై ఇతర ప్రాంతాలకు వెళ్లగా ప్రస్తుతం కోదాడ సీనియర్‌ సివిల్‌ జడ్జి సురేష్‌ ఇన్‌చార్జి జడ్జిగా పనిచేస్తున్నారు. దాంతో భువనగిరి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తున్న శ్యామ సుందర్‌ను పూర్తి స్థాయి సీని యర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి..

నూతనకల్‌ : ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మాజీ వార్డు సభ్యుడు రేషన్‌ దుకాణం నుంచి లబ్ధిదారుల ఇంటికి బియ్యాన్ని తీసుకొచ్చి అందిస్తున్నాడు. నూతనకల్‌ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ బొల్లెద్దు నాగయ్య భార్య కీర్తన మాజీ వార్డు మెంబర్‌. అయితే వీరు గతంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రేషన్‌ షాపు నుంచి లబ్ధిదారుల ఇంటి వరకు రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా తమ ఆటోలో చేరవేసే వారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో కీర్తన పోటీ చేయలేదు. అయినా సరే రేషన్‌ షాపు నుంచి లబ్ధిదారులకు చెందిన బియ్యాన్ని తన ఆటోలో ఇంటింటికి చేరవేస్తున్నాడు. దాంతో గ్రామస్తులు నాగయ్యను అభినందించారు.

11శాతం ఎస్సీ రిజర్వేషన్లు

అమలు చేయాలి

సూర్యాపేట : రాష్ట్రంలో మాదిగల జనాభా ప్రకారం 11శాతం ఎస్సీ రిజర్వేషన్ల వాటాని అమలు చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది స్వార్ధపరుల మాట విని ఎస్సీ వాటా తగ్గిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, బొజ్జ సైదులు మాదిగ, రవి మాదిగ, కొత్తపల్లి అంజయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement