సూర్యాపేటటౌన్ : వాహనాలను అజాగ్రత్తగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, సూర్యాపేటను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలోని నిర్వహించిన రోడ్డు భద్రతా ర్యాలీని కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పిల్లలమర్రి వద్ద రోడ్డుపై బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించారు. సూచన బోర్డులు ప్రారంభించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలతో ప్రతి ఏడాది ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా, సీటు బెల్ట్ పెట్టకుండా నిర్లక్ష్యంగా వాహనాలను నడపడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 2023లో 257 మంది, 2024లో 278, 2025లో 230, 2026 ఏప్రిల్ వరకు 78 మంది మరణించినట్లు తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్– అలైవ్ వంటి కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన రాష్ట్ర పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సహా యం అందించిన వారిని రహదారి హీరోగా గుర్తించి ప్రోత్సాహం అందిస్తామన్నారు. అనంతరం గ్రామాల్లోకి హెల్మెట్ లేకుండా రావద్దని తీర్మానించిన పత్రాలను కోదాడ మండల సర్పంచ్‌లు అందించారు. పోలీసు కళాబృందం నిర్వహించిన నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీ శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం సునీత, ఆర్టీఓ జయప్రకాశ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ నివేదిత, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఫ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా


