మాడుగులపల్లి : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్‌కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్‌సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది.
యువతితో పెళ్లి కుదుర్చుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు
పోలీసుల అదుపులో నిందితుడు..?


