పెద్దవూర: ప్రభుత్వ ఎస్టీ వసతి గృహాల్లో పనిచేసే వర్కర్లకు ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేసే హాస్టల్ వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో వారి రోజువారీ జీవితం కుదేలవుతుంది. అప్పులు చేసి మరీ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో 312 మంది వర్కర్లు
నల్లగొండ జిల్లాలో 43 గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో విద్యార్థులకు వంట చేయడం, హాస్టల్ గదులను, పరిసరాలను, బాత్రూంలు, మూత్రశాలలు శుభ్రపరచడం వంటి పనులు చేసేందుకు గాను 312 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు హాస్టల్‌లోనే ఉంటూ పనులు చేయాల్సి ఉంటుంది.
రెగ్యులర్ వర్కర్లతో సమానంగా ...
ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాలలో పనిచేసే రోజువారి వర్కర్లు రెగ్యులర్ వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నా.. వారికి ఇస్తున్న వేతనం రూ.13,328 మాత్రమే. పని మాత్రం ప్రతిరోజూ చేస్తున్నా. జీతం మాత్రం రావడం లేదని, ఇలా అయితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో తమ పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేకపోతున్నారు.
నవంబర్ నుంచి పెండింగ్..
గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదని, దీంతో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తున్నామని వర్కర్లు వాపోతున్నారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేపు మాపు అంటున్నారు
గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదు. పది రోజులైతే ఈ విద్యాసంవత్సరం కూడా అయిపోతుంది. జీతాల గురించి అడిగితే రేపొస్తాయి.. మాపొస్తాయి అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు హాస్టళ్లలోనే పనిచేస్తుండటంతో వేరే పనులకు వెళ్లే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి తక్షణమే వేతనాలు ఇప్పించాలి.
– నాగేందర్, వర్కర్, ఎస్టీ హాస్టల్, పెద్దవూర
కుటుంబ పోషణ కష్టంగా ఉంది
ఐదు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. మాకు వేరే పనులకు వెళ్లడానికి వీలు ఉండదు. కిరాణ దుకాణాలు, పాలు పోసే వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చకపోవడంతో సరుకులు ఇవ్వడం లేదు. పాలు పోయడం లేదు. చేసిన అప్పులు తీర్చాలని అప్పులోల్లు ఒత్తిడి చేస్తున్నారు.
– బొడ్డు రాములమ్మ,
ఎస్టీ హాస్టల్ వర్కర్ పెద్దవూర
కుటుంబ పోషణ భారంగా మారిందంటున్న ఎస్టీ హాస్టళ్లలో పనిచేసే వర్కర్లు
అధికారులు స్పందించి జీతాలు
ఇవ్వాలని వేడుకోలు


