చెరువులో మునిగి యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి యువకుడి గల్లంతు

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

భూదాన్‌పోచంపల్లి : చెరువులో నాటుపడవపై షికారుకు వెళ్లగా.. పడవ మునగడంతో యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని గౌస్‌కొండ గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్‌కొండ గ్రామానికి చెందిన పాండాల శివ మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని ఘట్కేసర్‌లో ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. శివ సోమవారం ఉదయం బైక్‌పై డ్యూటీకి బయల్దేరుతుండగా.. అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితులు దుర్గాప్రసాద్‌, సాయి, తరుణ్‌, మల్లేశ్‌, రాము ఫోన్‌ చేసి పార్టీ చేసుకుందామని శివకు చెప్పారు. దీంతో శివ తన తల్లికి ఫోన్‌ చేసి ఈరోజు డ్యూటీకి వెళ్లడంలేదని చెప్పాడు. అనంతరం స్నేహితులంతా కలిసి గ్రామ శివారులోని చెరువు సమీపంలో మద్యం సేవించారు. అనంతరం చెరువు ఒడ్డున మత్స్యకార్మికులు చేపలు పట్టేందుకు ఉపయోగించే నాటుపడవ కనిపించడంతో సరదాగా చెరువులో షికారు కొడదామని అందరూ కలిసి పడవ ఎక్కి చెరువు లోపలికి వెళ్లారు. చెరువులో కొద్దిదూరం వెళ్లాక అకస్మాత్తుగా పడవలోకి నీళ్లు రావడంతో వారంతా భయపడి ఒక్కొక్కరుగా చెరువులోకి దూకారు.

ఐదుగురిని రక్షించిన చెక్క వెంకటేశ్‌..

చెరువులోకి దూకిన వారంతా ఈత కొడుతూ కొద్దిదూరం వచ్చారు. మద్యం మత్తులో ఉండడంతో ఒడ్డు వరకు ఈదలేక కేకలు వేయగా.. అటుగా వెళ్తున్న మత్స్యకార్మికుడు చెక్క వెంకటేశ్‌ గమనించి థర్మాకోల్‌తో చేసిన తెప్ప సహాయంతో ఐదుగురిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. శివకు ఈత రాకపోవడంతో చెరువులో మునిగి గల్లంతయ్యాడు. ఒడ్డుకు చేరిన మిగతా యువకులు భయంతో అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోచంపల్లి ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గల్లంతైన శివ ఆచూకీ కోసం స్థానిక మత్స్యకార్మికుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement