నేరేడుచర్ల : డాంబర్ మిల్లులో పార్కింగ్ చేసిన టిప్పర్లలోని బ్యాటరీలు చోరీ చేసిన ముగ్గురు దొంగలను నేరేడుచర్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న రాత్రి నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద గల డాంబర్ మిల్లులో పార్కింగ్ చేసిన మూడు టిప్పర్లలోని బ్యాటరీలతో పాటు జనరేటర్ రూంలోని బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. డాంబర్ మిల్లు వాచ్‌మన్ మాతంగి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి శివయ్య, కంచుగంటి కార్తీక్, పంటమూల జానయ్య చోరీ చేసిన బ్యాటరీలను ఆటోలో తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు వారి ముగ్గురిని అరెస్ట్ చేసి హుజూర్‌నగర్ కోర్టులో హాజరుపర్చి జడ్జి తీర్పు మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కాల్వలో బోల్తా పడిన కారు
● ముగ్గురికి స్వల్ప గాయాలు
సూర్యాపేటటౌన్ : కారు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం తెల్ల వారుజామున సూర్యాపేట పట్టణంలో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి కారులో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో సూర్యాపేటలోని అంజనాపురి కాలనీ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి కాల్వలో బోల్తా పడింది. కారు డ్రైవర్‌కు, ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.


