పోలీస్‌ కుటుంబాలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కుటుంబాలకు అండగా ఉంటాం

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

సూర్యాపేట టౌన్‌ : పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు అండగా పోలీస్‌ భద్రత స్కీమ్‌ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారా యణ ఇటీవల మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత స్కీం కింద మంజూరైన ఆర్థికసాయం చెక్కును బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉండి అకాలంగా మృతిచెందిన సిబ్బంది కుటుంబాలను పోలీస్‌ శాఖ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్‌ అధికారి మంజు భార్గవి, పోలీస్‌ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్‌ గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కోదాడ వైద్యశాలలో ఆర్డీఓ విచారణ

కోదాడ : కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య సిబ్బంది నియమాకాల్లో అవకతవకలు జరిగాయని కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాలతో బుధవారం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి శంకర్‌ వైద్యశాలలో విచారణ చేపట్టారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ బుధవారం ‘నియమాకాల్లో సిత్రాలు’ శీర్షికన వార్త ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించిన ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికులను వైద్యశాలకు పిలిపించి వారు విచారణ చేశారు. ఏడుగురి వేతనాలను 11 మందికి పంచుతున్న విషయంపై వాంగ్మూలం సేకరించారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల ఇన్‌చార్జి సూపరిండెంట్‌ డాక్టర్‌ దశరథ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి

కోదాడ : ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి సిబ్బంది, అధికారులు కృషిచేయాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖుష్యూషాఖాన్‌ సూచించారు. బుధవారం కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు అందుతున సేవలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజూర్‌నగర్‌లో కొత్త బస్టాండ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కోదాడ నుంచి ఖమ్మం వరకు వయా నడిగూడెం మీదుగా బస్‌ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నడిగూడెం మండలం చనుపల్లి, కోదాడ మండలం గణపవరానికి కూడా త్వరలో బస్‌సౌకర్యం కల్పిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా ఐదు లక్షల స్మార్ట్‌ కార్డులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎం జానిరెడ్డి, డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement