ఫ యథేచ్ఛగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న కమీషన్ వ్యాపారులు
ఫ మద్దతు ధర కంటే తక్కువకు కొని మిల్లులకు తరలింపు
నేరేడుచర్ల : నేరేడుచర్లలో ధాన్యం వ్యాపారం రోడ్డెక్కింది. కొందరు వ్యాపారులు.. మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని రోడ్ల వెంటే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసి రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ ఘటన నేరేడుచర్ల మండల పరిధిలో యథేచ్ఛగా సాగుతోంది. పది రోజులుగా నేరేడుచర్ల మండలంలో యాసంగి వరికోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం దిగుబడి అధికంగా వస్తోంది. ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు నేరేడుచర్లలోని హుజూర్‌నగర్ రోడ్డు, జాన్‌పహాడ్ రోడ్డు, బైపాస్ రోడ్డులో తమ ఆఫీసులను ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొంటున్నారు. క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,380 ఉండగా అంతకంటే తక్కువగా రూ.2,300లే చెల్లిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒప్పందంలో కమీషన్ పొందుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.


