అధ్వానంగా అర్బన్‌పార్క్‌ | - | Sakshi
Sakshi News home page

అధ్వానంగా అర్బన్‌పార్క్‌

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

రెండున్నర ఎకరాల్లో

రూ. కోట్ల ఖర్చుతో ఏర్పాటు

నిర్వహణ వదిలేయడంతో

పచ్చదనం మాయం

ఉన్న ఒక్క పార్క్‌నూ పట్టించుకోక పోవడంపై స్థానికుల విమర్శలు

కోదాడ : కోదాడ పట్టణ ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన ఏకై క పార్క్‌ అధ్వానంగా మారింది. రూ.2.5 కోట్లు ఖర్చు చేసి రెండున్నర ఎకరాల్లో అభివృద్ధి చేసిన కోదాడ అర్బన్‌ పార్క్‌ నిర్వహణలేక ఆనవాళ్లు కోల్పోతోంది. రెండు ఏళ్లుగా పార్కును మున్సిపల్‌ అధికారులు పట్టించుకోక పోవడంతో పచ్చదనం కోల్పోయి పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. పార్కులోని బెంచీలు, క్రీడా పరికరాలు, విద్యుత్‌ దీపాలు విరిగిపోయాయి. పార్కు దుస్థితిపై ఓ బాలిక సోషల్‌ మీడియాలో పెట్టిన రీల్‌ చర్చనీయాంశమైంది.

రెండున్నర కోట్ల ఖర్చుతో..

కోదాడ పట్టణంలోని 8వ వార్డులో ఉత్తమ్‌పద్మావతి నగర్‌ లే అవుట్‌ కింద వచ్చిన రెండున్నర ఎకరాల స్థలంలో కోదాడ అర్బన్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పార్కు అభివృద్ధికి టీయూఎఫ్‌ఐడీసీ నిధుల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేసి వివిధ పనులు చేపట్టారు. 2023లో మరోసారి కోటిన్నర ఖర్చు చేసి పార్కును అభివృద్ధి చేశారు. పచ్చదనం కోసం మొక్కలను నాటడం, వాకింగ్‌ ట్రాక్‌, విద్యుత్‌ దీపాలు, మరుగుదొడ్లను నిర్మించారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను కూడ ఏర్పాటు చేశారు.

కొద్దిరోజులకే శిథిలావస్థకు

పార్క్‌లో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, బెంచీలు, డస్ట్‌బిన్‌లు నాసిరకానివి కావడంతో కొద్ది రోజులకే పాడైపోయాయి. నిర్వహణ లేక వాకింగ్‌ ట్రాక్‌ మీద పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. పార్కులో మొక్కలకు నీరు పెట్టడానికి ఎవ్వరూ లేకపోవడంతో అవన్నీ ఎండిపోయాయి. పార్క్‌లో ఉన్న బోర్‌ మోటారు సైతం తీసుకెళ్లారని స్ధానికులు అంటున్నారు. మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్ధకు చేరడంతో పాటు వాటిలో సైతం పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగిపోయాయి. తలుపులు ధ్వంసమై వినియోగించుకునేందుకు వీలులేకుండా పోయాయి.

చర్చనీయాంశమైన బాలిక రీల్‌

కోదాడ పట్టణంలోని ఓ పాఠశాలలో చదువుతున్న బాలిక అర్బన్‌ పార్క్‌ దుస్థితిపై రీల్‌ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టింది. పార్కు దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, అధికారుల పనితీరు ఎండగడుతూ ఉన్న రీల్‌ ప్రస్తుతం కోదాడ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అయినా కోదాడ మున్సిపల్‌ అధికారులు మాత్రం ఈ విషయమై స్పందించడం లేదు.

పార్కులోని వాకింగ్‌ ట్రాక్‌ దుస్థితి

కోదాడ అర్బన్‌పార్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement