రీ పోస్టుమార్టం చేసేందుకు భయం ఎందుకు
సూర్యాపేట : తప్పుడు రికార్డులతో కేసు తారుమారు చేసిన అధికారులను, పోలీస్‌లను సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి టేకుమట్లలో నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధాకరమన్నారు. పోలీసులు ఏ తప్పు చేయకపోతే కర్ల రాజేష్ మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేయించేందుకు భయం ఎందుకని ప్రశ్నించారు. కర్ల రాజేష్ లాకప్ డెత్‌లో నిందితుడైన ఎస్‌ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా కాపాడుతున్నారని, బాధ్యులైన వారిని అరెస్టు చేయాలన్నారు. కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్ మాదిగ, మున్నంగి నాగరాజు మాదిగ, రావుగాళ్ల బాబు మాదిగ, రాజు, యాతాకుల ఈశ్వర్ పాల్గొన్నారు.
కోదాడరూరల్ : పోలీసులు చిత్రహింసల కారణంగా ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు పోలీసుశాఖ ఎందుకు జంకుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. గురువారం కోదాడ మండల పరిధిలోని గణపవరంలో నిర్వహించిన రాజేష్ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్ల రాజేష్‌ను అప్పటి చిలుకూరు ఎస్‌ఐ సురేష్‌రెడ్డి, మరికొందరు పోలీసులు కలిసి తీవ్రంగా కొట్టి చంపారన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ నెల 28న చలో సూర్యాపేట పేరుతో ప్రజా ఆగ్రహ మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పిడమర్తి చిన్న వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపూరి రాజుమాదిగ, కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, మాజీ సర్పంచ్ పొట్టా శ్రీవిజయ కిరణ్, పొట్టా జగన్, చంద్రమౌళి, రవి, మధు, శ్రీను, బుచ్చాలు, బండి సత్యం, దుర్గయ్య పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


