నేడు మాంసం విక్రయాలు నిషేధం
హుజూర్‌నగర్ : గణతంత్ర వేడుకల దృష్ట్యా సోమవారం మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాలు నిషేధించినట్లు హుజూర్‌నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమాన విధించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
బార్ కౌన్సిల్ ఎన్నికల అధికారిగా లింగయ్య
చివ్వెంల(సూర్యాపేట) : రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 30న జరగనున్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్ని కల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కోర్టు ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ దగ్గుబాటి యతి రాజులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం నిత్యారాధనల్లో భాగంగా శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. ఉత్సవమూర్తులను వధూవరులుగా దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు.. ఎదుర్కోళ్లు, వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవ, మూలవిరాట్‌కు అభిషేకం, సహస్రనామార్చన తదితర పూజలు గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు. పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
చదువుతోనే
ఉన్నత శిఖరాలకు
తిరుమలగిరి (తుంగతుర్తి ): ప్రస్తుత సమాజంలో చదువుతోనే అన్నీ సాధ్యమని, బాలికలు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర సాంస్కతిక సలహా మండలి సభ్యుడు ఏపూరి సోమన్న అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుమలగిరిలోని కస్తూరిబాగాంధీ పాఠశాలలో మార్పు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమ్మాయిలు విద్యార్థి దశలోనే లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సా గాలన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ సుష్మిత, మార్పు సొసైటీ అధ్యక్షుడు పోరెళ్ల విప్లవకుమార్, లయన్‌న్స్‌క్లబ్ అధ్యక్షుడు గుండాల మురళీధర్, సామాజిక కార్యకర్త పోరెళ్ల లక్ష్మయ్య, ఉపాధ్యాయులు టి.కవిత , బి.కవిత, వాణి, కళావతి ఇందిర, కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతోన్న నీటి విడుదల
అర్వపల్లి: ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశ ద్వారా జిల్లాకు గోదావరి జలాల విడుదల కొనసాగుతోంది. రెండో విడత కింద 1,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జలవనరులశాఖ ఈఈ, బయ్యన్నవాగు ఏఈ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయొద్దని సూచించారు.
నేడు మాంసం విక్రయాలు నిషేధం
నేడు మాంసం విక్రయాలు నిషేధం


