వేగంగా పాతాళానికి
బోర్లు తగ్గాయి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో భూగర్భ జలాలు క్రమంగా పడిపోతున్నాయి. భూగర్భ జలవనరుల శాఖ అధికారుల లెక్కల ప్రకారం 2025 నవంబర్ మాసంలో సరాసరి 2.78 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం.. డిసెంబర్ నాటికి 4.22 మీటర్ల లోతులోకి వెళ్లింది. ఎండ తీవ్రత కూడా అంతగా లేనప్పటికీ వేగంగా నీటిమట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లో నీరు పాతాళానికి చేరింది.
గతేడాదితో పోల్చితే..
జిల్లాలో భూగర్భ జలాలు గత ఏడాదితో పోల్చితే కొంత మెరుగ్గానే ఉన్నాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ వేగంగా భూగర్భ నీటి మట్టాలు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2024 డిసెంబర్‌లో 4.83 మీటర్ల లోతులో ఉండగా.. 2025 డిసెంబర్‌లో 4.22 మీటర్ల లోతులో ఉన్నాయి. నాగారం మండలంలో కేవలం 1.20 మీటర్లు, హుజూర్‌నగర్‌లో 1.40 మీటర్లు, గరిడేపల్లిలో 1.82 మీటర్లు, కోదాడ మండలంలో 1.86 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. ఇక గతేడాది మాదిరిగానే చింతలపాలెం, తిరుమలగిరి మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. చింతలపాలెంలో 2024 డిసెంబర్‌లో 11.02 మీటర్ల లోతులో ఉండగా.. మే నాటికి మరింత లోతులోకి 13.81 మీటర్లలోకి వెళ్లాయి. వర్షాకాలంలో కొంత మెరుగై 2025 నవంబర్‌లో 6.92 మీటర్ల పైకి రాగా, డిసెంబర్ నాటికి 10.17 మీటర్ల లోతుకు వెళ్లాయి. తిరుమలగిరిలోనూ గత డిసెంబర్‌లో అత్యంత లోతు 12.91 మీటర్లలో ఉండగా, ఈసారి కొంత మెరుగుపడి 7.87 మీటర్ల పైన ఉంది. ఈ ఏడాది భూగర్భ నీటి మట్టం అత్యంత లోతులో ఉన్న మండలాల్లో తిరుమలగిరి రెండో స్థానంలో ఉంది.
చెరువులు, కుంటలు నింపితేనే..
నాగార్జునసాగర్ ఎడమ కాలువ, మూసీతో పాటు ఎస్సారెస్పీ రెండోదశ ద్వారా పంటలకు నీరందించడంతో పాటు చెరువులు, కుంటలు నింపితేనే రాబోయే వేసవి కాలంలో సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. లేదంటే సీజన్ చివరి దశలో పంట పొలాలకు నీరందక ఎండిపోయే అవకాశం లేకపోలేదు.
కారణం ఏమంటే..
సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైనా వరద నీరు భూమిలో ఇంకే పరిస్థితి లేకుండాపోయింది. విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలు అన్యక్రాంతం కావడమే కారణమని భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. వృథాగా పోతున్న 40 శాతం నీటిని ఒడిసిపడితే నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రమాదఘంటికలు మోగిస్తున్న భూగర్భ నీటి మట్టాలు
నవంబర్ నుంచి డిసెంబర్ వరకు 4.22 మీటర్ల లోతుకు పడిపోయిన జలం
మే నాటికి మరింత లోతుకు
పోతాయని అంచనా
వేసవి రాకముందే భూగర్భ నీటిమట్టం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గ్రౌండ్‌వాటర్ క్రమంగా పాతాళం వైపు పయనిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు మీటరున్నర లోతుకు నీటిమట్టాలు పడిపోయాయి. ఇలాగే కొనసాగితే వచ్చే రెండు, మూడు నెలల్లో పంటలకు చివరి
దశలో నీరందకుండా పోయే ప్రమాదం ఉంది.
వానాకాలం వర్షాలు సమృద్ధిగానే పడ్డాయి. ఎండలు కూడా ముదరలేదు. అయినా బోర్లు తగ్గాయి. చాలా వరకు రైతులు బోర్ల ద్వారా సాగు చేస్తున్నారు. దీంతో భూగర్భజలాలు తొందరగా పడిపోతున్నాయి. ప్రభుత్వం ఎస్సారెస్పీ నీటిని అధికంగా వదిలి చెరువులు, కుంటలు నింపాలి. ఎండలు ముదిరితే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
– జటంగి శ్రీను, రైతు, తుంగతుర్తి
వేగంగా పాతాళానికి


