వ్యవసాయ కళాశాలకు భూమి అప్పగింత
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు అవసరమైన భూమిని మంగళవారం తహసీల్దార్ బి.కవిత వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బి.అనిల్‌కుమార్‌కు అప్పగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలకు మొత్తం 100 ఎకరాలు అవసరమై ఉండగా ప్రస్తుతం 97.24 ఎకరాలు స్వాధీనం చేసినట్లు తెలిపారు. మిగిలిన భూమిని త్వరలోనే జిల్లా కలెక్టర్ అందిస్తారని పేర్కొన్నారు.
లక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి నాగవల్లీదళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
లౌకిక పార్టీలతో కలిసి ముందుకెళతాం
సూర్యాపేట అర్బన్ : మున్సిపల్ ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే లౌకిక వాద పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో సీపీఎం పోటీ చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై లోతైన అవగాహన ఉన్న వారిని గెలిపిస్తే వారు ప్రజా సమస్యలపై గళమెత్తి వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మీ పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్
ఇంగ్లిష్ ప్రాక్టికల్స్
సూర్యాపేటటౌన్ : ఈ నెల 21, 22 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 8,500 మంది, ద్వితీయ సంవత్సరంలో 7,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మొత్తం 20 మార్కులకు గానూ కనీసం ఏడు మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. విద్యార్థులు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు తప్పని సరిగా హాజరు కావాలని, లేకపోతే ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ తెలిపారు.
గడువు పొడిగింపు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం ఎస్సీ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి గానూ 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశానికి విద్యారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ కళాశాలకు భూమి అప్పగింత
వ్యవసాయ కళాశాలకు భూమి అప్పగింత


