35 వారు్డలు.. 350 దరఖాస్తులు
కోదాడ: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. కోదాడ మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్ స్థానాలకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. ఒక్క రోజే సమయం ఇవ్వడంతో సుమారు 350 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 35 వార్డులకు గాను సగటున ఒక్కో వార్డుకు 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా బాలాజీనగర్‌లోని 7వ వార్డుకు 40 వరకు, 19వ వార్డుకు కూడా అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వచ్చిన దరఖాస్తులను వార్డుల వారీగా వేరు చేస్తున్నారు. వీటిని స్క్రూట్నీ చేయడానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని పార్టీ నాయకులకు ఎమ్మెల్యే చెప్పినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు
సోమవారం కోదాడలో నిర్వహించిన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పద్మావతిని పెద్ద సంఖ్యలో ఆశాశాహులు టికెట్ కోసం విన్నవించారు. పలువురు తాజా మాజీలతో పాటు పార్టీని అనేక సంవత్సరాలుగా అంటిపెట్టుకున్న వారు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారిని ఎమ్మెల్యే నిరాశపర్చకుండా ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
వేచిచూస్తున్న విపక్షాలు
అధికారపక్షంలో ఎన్నికల జోష్ కనిపిస్తుండగా విపక్షాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ క్షేత్రస్థాయిలో అంతర్గతంగా సర్వే చేయిస్తూ, దీని ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలిసింది. కొద్ది రోజులుగా ఆయన కోదాడలోనే మకాం వేసి అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తమకు పట్టున్న కొన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటుంది. పోటీకి సీపీఎం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇక సీపీఐ నుంచి గతంలో 17వ వార్డుకు ప్రాతినిధ్యం వహించిన బత్తినేని హనుమంతరావుకు ఈసారి రిజర్వేషన్ కలిసి రాలేదు. అది బీసీలకు రిజర్వు కావడంతో ఆయన మరోవార్డు వేటలో ఉన్నారని, పొత్తులో భాగంగా తనకు పక్క వార్డు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం.
పాత, కొత్త నేతల మధ్య
తీవ్రమైన పోటీ
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్న తాజామాజీలకు, గత ఎన్నికల్లో వీరిపై పోటీ చేసి ఓడిపోయిన వారి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి 25 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ అభ్యర్థులపై గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిస్థితుల్లో వారంతా కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తుండంతో 2019లో వీరిపై పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక నాయకులకు కత్తిమీద సాములాగా మారిందని పలువురు అంటున్నారు.
కోదాడ కాంగ్రెస్‌లో కౌన్సిలర్ టికెట్‌లకు ఫుల్ డిమాండ్
ఒక్కో వార్డుకు 10 మంది..
ముగిసిన దరఖాస్తు ప్రక్రియ


