సగం రోడ్డు..షాపులకే!
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినా కూరగాయల దుకాణాలు మాత్రం రోడ్డుపైనే కొనసాగుతున్నాయి. దీంతో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్ ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. నాన్ వెజ్, పూల అమ్మకాలు మినహా పండ్లు, కూరగాయల దుకాణాలు మళ్లీ రోడ్డెక్కాయి. దీంతో ఆయా దుకాణాలే సగం వరకు రోడ్డును ఆక్రమించడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు మార్కెట్ లోపల ఉన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతంలోనే ఎరువులు, పురుగు మందుల షాపులు ఉండడంతో నిత్యం రైతులు వస్తుండడంతో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి జనానికి ఉపశమనం కలిగించేందుకు గత ప్రభుత్వ హయాంలో రోడ్డుపై ఒక వ్యాపారి కూడా వ్యాపారం చేయకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించింది. గతేడాది ఈ మార్కెట్‌ను ప్రారంభించినా అందరు వ్యాపారులు అందులో తమ వ్యాపారాలు చేయడం లేదు. అయితే మార్కెటింగ్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో రోడ్లపైనే కూరగాయల వ్యాపారం సాగుతోంది.
నడవాలంటే నరకం
ప్రస్తుతం సమీకృత మార్కెట్ రోడ్డుపై ఇరుపక్కలా నాలుగడుగుల మేర కూరగాయలు, ఇతర సామగ్రి దుకాణాలు పెడుతున్నారు. మధ్యలో మిగిలిన నాలుగైదు అడుగుల రోడ్డులోనే పాదాచారులు, వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఒక్క వాహనం ఆగినా మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెనుక ఉన్న వాహనదారులు పాదాచారులు వాహనాల మధ్యలో నుంచి నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంకర్ విలాస్ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా ఎంజీ రోడ్డు వరకు నిత్యం రద్దీగా ఉంటుండడంతో ఆ రోడ్డు వీదుగా వెళ్లాలంటే వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఖాళీగా సమీకృత వెజ్ నాన్, వెజ్ మార్కెట్
సూర్యాపేట పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అందులో కూరగాయలు, ఇతర వ్యాపారులకు అవకాశం కల్పిస్తే రోడ్డుపై దుకాణాలు పెట్టకుండా అడ్డుకోవచ్చు. దీంతో ట్రాఫిక్ సమస్యతోపాటు చిన్న చిన్న ప్రమాదాలకు పరిష్కారం దొరుకుతుంది రూ.కోట్లు వెచ్చించిన నిర్మించిన మార్కెట్‌లో స్టాళ్లు ఉండగా రోడ్డుపై కూరగాయల వ్యాపారులు వ్యాపారం చేస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో పక్క రోడ్డుపై వ్యాపారంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మార్కెట్ లోపల వ్యాపారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే సమీకృత మార్కెట్ లోకి గాలి వెలుతురు రాకుండా ఉందని అందులోకి వెళ్లి వ్యాపారాలు చేయబోమని కొందరు అంటున్నారు. అధికారులు స్పందించి వ్యాపారులకు వెసులుబాటుగా ఉండేలా మార్కెట్‌లో దుకాణాలు ఏర్పాటు చేస్తే మంచిదని ప్రజలు భావిస్తున్నారు.
ఫ సూర్యాపేట సమీకృత
మార్కెట్ అలంకారప్రాయం
ఫ మార్కెట్ బయటే
కూరగాయల వ్యాపారం
ఫ రోడ్డుకు ఇరువైపులా
దుకాణాలతో ట్రాఫిక్ తిప్పలు


