ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వహించాలి
కోదాడ: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆదివారం పోలింగ్ విధులను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. శనివారం కోదాడలోని సీసీరెడ్డి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు, పేపర్లను క్షుణంగా పరిశీలించి తీసుకోవాలన్నారు. కేటాయించిన పోలింగ్ కేంద్రానికి జోనల్ అధికారితో కలిసి వెళ్లి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం 7 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ పూర్తిచేయాలన్నారు. అప్పటి వరకు ఓటర్లు ఇంకా మిగిలి ఉంటే వారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత జిల్లా ఎన్నికల అధికారి, జనరల్ అబ్జర్వర్ అనుమతి తీసుకున్న తర్వాతే స్టేజ్–2 రిటర్నింగ్ అధికారి తుది ఫలితాలు ప్రకటించాలన్నారు.
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
చిలుకూరు : రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లుగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శనివారం చిలుకూరులో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, మండల ఎన్నికల ప్రత్యేక అధికారి దయానందరాణి, ఎంపీడీఓ గిరిబాబు, తహసీల్దార్ ధ్రువకుమార్, ఎంపీఓ ముక్కపాటి నరసింహారావు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


