వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి వార్లనుఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
హైకోర్టు అడ్వకేట్‌గా
పిడమర్తి వేణు
ఆత్మకూర్ (ఎస్) : హైకోర్టు అడ్వకేట్‌గా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు పిడమర్తి వేణు ప్రమాణం చేశారు. వేణు పాఠశాల విద్యాభ్యాసం సొంత గ్రామంలో, కళాశాల, న్యాయ విద్య కొత్తగూడెం, హైదరాబాద్‌లో పూర్తిచేశారు. తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన దివంగత సీపీఐ ఎంఎల్ జిల్లా నాయకుడు బొర్ర వీరన్న కుమారుడైన వేణు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో క్రియాశీలకంగా పనిచేశారు. వేణు న్యాయవాదిగా ప్రమాణం చేసిన సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు.
పటిష్ట బందోబస్తుతోనే పోలింగ్ ప్రశాంతం
మునగాల: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 8 మండలాల్లో ఐదంచెల భద్రతతో పటిష్ట బందోబస్తు నిర్వహించడం ద్వారానే ఆదివారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ నరసింహ తెలిపారు. ఆదివారం ఆయన మునగాల మండలం మాధవరం, మునగాల, కలకోవ, ముకుందాపురం గ్రామాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలకోవలో ఎస్పీ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆరు, సూర్యాపేట పరిధిలో రెండు మండలాల్లో మొత్తం 158 గ్రామాల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. సమస్యాత్మక గ్రామాల్లోనూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
సూర్యక్షేత్రంలో పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు.
మూడు ఓట్లతో విజయం
పెన్‌పహాడ్ : పెన్‌పహాడ్ మండల పరిధిలోని భక్తాళాపురంలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జుట్టుకొండ యమున మూడు ఓట్లు తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించింది. యమునకు 501, కాంగ్రెస్ మద్దతుదారు నల్లపు శేషలక్ష్మికి 500 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేయాలని అధికారులను శేషలక్ష్మి కోరారు. దీంతో రీ కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో శేషలక్ష్మికి వచ్చిన ఓట్లులో రెండు చెల్లనివి గుర్తించారు. దీంతో మూడు ఓట్ల తేడాతో యమున గెలుపొందినట్లు తహసీల్దార్ తెలిపారు.
వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణం


