ఓటెత్తిన పల్లె జనం
పోలింగ్ వివరాలు ఇలా..
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 89.55 శాతం పోలింగ్
కోదాడ : రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆరు, సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని 2 మండలాల్లోని 158 పంచాయతీలు, 1287 వార్డుల్లో పోలింగ్ జరగగా 2,10,576 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 89.55 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా మండలాల్లో 23 పంచాయతీలు, 166 వార్డులు ఏకగ్రీవమైన విషయం విదితమే. ఎన్నికలు జరిగిన అన్ని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘనలు చోటుచేసుకోలేదు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తోపాటు ఎస్పీ నరసింహ మండలాల్లో పర్యటించి ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఓటేయని 24,561 మంది ఓటర్లు
రెండో విడత ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో 2,35,137 మంది ఓటర్లుండగా వీరిలో 2,10,576 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 24,561 మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులుదీరారు. ఓటు వేసేందుకు దూర ప్రాంతాల నుంచి ఓటర్లు గ్రామాలకు తరలిరావడంతో అంతటా సందడి నెలకొంది. పోలింగ్ కేంద్రాల సమీపంలో తమ అభ్యర్థులకు ఓటు వేయాలని పలువురు గుర్తులు పట్టుకొని అభ్యర్థించడం కనిపించింది. చలి ఉన్నప్పటికి లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు తరలివచ్చారు. 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకు 59,196 మంది (25.18) శాతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 9 నుంచి 11 గంటల మధ్యలో 82,047 మంది (34.89) శాతం ఓటుహక్కు వినియోగించకోగా చివరి రెండు గంటల్లో 69,333 మంది (29.48 శాతం) ఓటర్లు ఓటెత్తారు. మొత్తంగా 2,10,576 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోగా 89.55 శాతం పోలింగ్ నమోదైంది.
చివ్వెంల మండలంలో అత్యధికంగా..
రెండో విడత ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలంలో అత్యధికంగా 91.99 శాతం పోలింగ్ నమోదైంది. 28,155 మంది ఓటర్లు ఉండగా వీరిలో 25,901 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న మోతె మండలంలో అత్యల్పంగా 86.90 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 31,907 మంది ఓటర్లు ఉండగా వీరిలో 27,726 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లలో పురుషులు 89.84 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా మహిళలు 89.28 శాతం మంది ఓటేశారు. ఇతరులు 8 మంది ఉండగా ఐదుగురు మాత్రమే ఓటేశారు.
మండలం మొత్తంఓట్లు పోలైనవి శాతం
అనంతగిరి 24,294 22,113 91.02
చిలుకూరు 29,790 26,511 88.99
నడిగూడెం 22,862 20,393 89.20
మునగాల 35,945 31,912 88.78
కోదాడ 28.107 25,026 89.04
మోతె 31,907 27,726 86.90
చివ్వెంల 28,155 25,901 91.99
పెన్‌పహాడ్ 34,077 30,994 90.95
మొత్తం 2,35,137 2,10,576 89.55
ఫ తొలి విడతకన్నా 0.14 శాతం తక్కువ..
ఫ ఓటేసిన 2,10,576 మంది ఓటర్లు
ఫ పురుషులు 89.84 శాతం,
మహిళలు 89.28 శాతం
ఫ చివ్వెంలలో అత్యధికం.. మోతెలో అత్యల్పం


