ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చూపొద్దు
చివ్వెంల, పెన్‌పహాడ్ : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చూపకుండా పోలీస్ సిబ్బంది అంతా సమన్వయంతో ఒకే జట్టుగా పనిచేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం చివ్వెంల, పెన్‌పహాడ్ మండల కేంద్రాల్లో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పోలీసుల పాత్ర కీలకమని, పూర్తి అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన స్థలాలు వదలవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూపద్ధతి పాటించేలా చూడాలన్నారు. ఓటర్లకాని వారిని పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లోకి రానివద్దన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవీదర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, రామారావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
1,500 మంది సిబ్బందితో బందోబస్తు
సూర్యాపేట టౌన్ : జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న చివ్వెంల, పెన్‌పహాడ్, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, కోదాడ, చిలుకూరు మండలాల్లో 1,500 మంది పోలీస్ సిబ్బందితో ఐదంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇద్దరు ఏఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 15 మంది ఇన్‌స్పెక్టర్లు, 50 మంది ఎస్‌ఐలు, అసిస్టెంట్ ఎస్‌ఐలు, హెచ్‌కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ నిఘా ఉందని, ఎవరైనా ఎన్నికల విధానానికి అటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ లొకేషన్ల వద్ద సంబంధిత సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఆన్‌లైన్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్లు కానివారు ఈ ఎనిమిది మండలాల్లో ఉండకూడదని సూచించారు. ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటేయాలని కోరారు.
ఫ ఎస్పీ నరసింహ


