
కమ్యూనిస్టులు ప్రభుత్వానికి సహకరించాలి
కోదాడ: ప్రజలతో నిత్యం కలిసి ఉండే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కోదాడలో మంగళవారం నిర్వహించిన సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సురవరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నల్లగొండ ఎంపీగా, సీపీఐ జాతీయ కార్యదర్శిగా సురవరం అందించిన సేవలు మరువలేనివని అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల వల్లే ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెట్టాయన్నారు. గతంలో తాగు, సాగునీటికు నోచుకోని నల్లగొండ జిల్లాకు కమ్యూనిస్టులు నిర్వహించిన ఉద్యమాలతో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని తెలుసుకొని ప్రజలు తినడానికి అనువుగా ఉండే సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఇప్పుడు రాష్ట్రంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడం పూర్తిగా ఆగిపోయిందన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తన జీవితకాలం పోరాటాలు నిర్వహించిన సురవరం సుధాకర్‌రెడ్డి నిజమైన పేదల పక్షపాతి అని కొనియాడారు. పేద మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతరం ఉద్యమించేవారని గుర్తు చేశారు. సురవరం చూపిన పోరాట మార్గాన్ని నేటి కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మునుగోడు మాజీ శాసనసభ్యుడు పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సురవరం కృషి చేసేవారని అన్నారు. ఎంపీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ ఎంపీ స్థానానికి తాను ఎంపీగా ఉండడం గర్వంగా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, గన్నా చంద్రశేఖర్, మేకల శ్రీనివాసరావు, బత్తినేని హనుమంతరావు, బద్దం కృష్ణారెడ్డి, డాక్టర్ సుబ్బారావు, ఉస్తేల సృజన, ముల్కలపల్లి రాములు, కెఎస్‌ఎన్ ప్రసాద్, చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, అల్తాఫ్ హుస్సేన్‌తో పాటు పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కమ్యూనిస్టులు ప్రభుత్వానికి సహకరించాలి