
నిజాం సైన్యంపై తిరగబడ్డ రావులపెంట
మిర్యాలగూడ: తోపుచర్ల ఫిర్కాలోని రావులపెంట కేంద్రంగా సాయుధ పోరాటం సాగింది. వేములపల్లి మండలంలోని ఆమనగల్లు, పాములపాడు, రావులపెంటలో క్యాంపులు నిర్వహించి నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేశారు. రావులపెంటలోని భూస్వామ్య కుటుంబలో పుట్టిన చల్లా సీతారాంరెడ్డి నిజాంను ఎదిరించేందుకు క్యాంపులు నిర్వహించి వారి స్థావరాలపై దాడులు చేశారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆ క్యాంపుల్లో ఎంతో మంది తలదాచుకునేవారు. నిజాం పోలీసులు రావులపెంట, ఆగామోత్కూర్, తడకమళ్ల గ్రామాల్లో చొరబడి దాడులు చేసేవారు. చల్లా సీతారాంరెడ్డితో పాటు నారబోయిన నర్సయ్య, గట్టికొప్పుల రాంరెడ్డి కలిసి మొదటిసారిగా రావులపెంటలో సభ నిర్వహించారు. అనంతరం ధరణికోట సుబ్బయ్య, గుంటి వెంకటనర్సయ్య, అవిరెండ్ల ఎల్లయ్య, జిన్నె పెద్ద సత్తిరెడ్డి, చిన్న సత్తిరెడ్డి, రామనర్సయ్య, దొంతిరెడ్డి వెంకట్రాంరెడ్డి, దొంతిరెడ్డి చెన్నారెడ్డి, పొలగోని గోపయ్య, అవిరెండ్ల రామచంద్రయ్యలతో కలిసి ఉద్యమ రూపకల్పన చేశారు. చల్లా సీతారాంరెడ్డిని పట్టుకోవడానికి ఒకరోజు నిజాం సైన్యం మాటువేసింది. కానీ రావులపెంట గ్రామస్తులంతా కలిసి వారి స్థావరంపై దాడి చేయడంతో నిజాం పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు.