
తొలగించారు.. నిర్మాణం మరిచారు!
కోదాడ: పురపాలక సంఘం అధికారుల నిర్లక్ష్యం కోదాడ పట్టణ ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మున్సిపాలిటీలో అత్యవసరంగా చేయాల్సిన పనులను సంవత్సరం కావొస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 1న కోదాడ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి రోడ్డుపై ఏర్పాటు చేసిన డివైడర్లను మున్సిపాలిటీ అధికారులు హడావుడిగా పగులగొట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన డివైడర్లను కూలగొట్టిన అధికారులు.. ఆ తరువాత వాటిని పునర్నిర్మించడం మరిచారు. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్ల రూపాయలు వృథా అయ్యాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
12 చోట్ల డివైడర్ల తొలగింపు..
గత సంవత్సరం సెప్టెంబర్ 1న కోదాడలో రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, రెడ్ చిల్లి ఏరియా, భవానీ నగర్, శ్రీరంగాపురం పరిధిలో పలు కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. వర్షపు నీరు వెళ్లకుండా సూర్యాపేట రోడ్డు, హుజూర్‌నగర్ రోడ్డు, మేళ్లచెరువు రోడ్డు, విజయవాడ రోడ్డులో 12 చోట్ల అడ్డుగా ఉన్న డివైడర్లను జేసీబీ సాయంతో తొలగించారు. ఆ తరువాత వాటిని పునర్నిర్మించాల్సి ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో డివైడర్లు పగులగొట్టిన ప్రాంతం నుంచి పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు దాటుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు స్టాపర్లు అడ్డుపెట్టగా మరికొన్ని చోట్ల కంపను తాత్కాలికంగా అడ్డుగా ఏర్పాటు చేశారు.
మీరంటే.. మీరే చేయాలంటూ..
కోదాడ పట్టణంలో రూ.34 కోట్ల నిధులతో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్ల విస్తరణ పనులను గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేశారు. గత సంవత్సరం వర్షాలకు పలు కాలనీలు ముంపునకు గురవుతుండడంతో మున్సిపాలిటీ అధికారులు డివైడర్లను పగులగొట్టారు. కాబట్టి మున్సిపాలిటీ అధికారులే వీటిని పునర్నిర్మించాలని ప్రజారోగ్యశాఖ అధికారులు అంటుండగా.. తమ వద్ద నిధులు లేవని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నట్టు సమాచారం. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో కోదాడ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత సంవత్సరం వరదలకు
కోదాడలో డివైడర్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది
నేటికీ మరమ్మతులు చేయని అధికారులు
ప్రమాదాల బారిన పడుతున్న
పాదచారులు
ప్రమాదాలు జరగకుండా చూడాలి
కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లకు గతంలో పెట్టిన గాడులను వెంటనే మూసివేయాలి. వీటివల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మున్సిపాలిటీలో నిధులు లేవని అధికారులు చెప్పడం సరైంది కాదు. యుద్ధప్రాతిపదికన గాడులను మూసి వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి.
– ఈదుల కృష్ణయ్య, న్యాయవాది, కోదాడ

తొలగించారు.. నిర్మాణం మరిచారు!