
పంటలకు జీవం
పత్తి రైతులు ఎరువులు వేసుకోవాలి
రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున పత్తి రైతులు ఎరువులు వేసుకోవాలి. తేమశాతం ఉన్నప్పుడు వాడితేనే పంట ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఎరువులను నిర్దిష్ట మోతాదులో వినియోగించాలి.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
భానుపురి (సూర్యాపేట) : రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో పంటలకు జీవం పోసినట్లయ్యింది. ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైన ప్పటి నుంచి జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలే ఇప్పటి వరకు సాగుకు ఉపయోగపడ్డాయి. తదనంతరం ఎలాంటి వర్షాలు లేక సాగు ముందుకు సాగలేదు. వర్షాభావ పరిస్థితులతో మెట్ట పంటల్లోనూ ఎదుగుదల లోపించింది. వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఈ దశలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి.
చెరువులు, కుంటల్లోకి వరద నీరు
జిల్లాలోని చాలా మండలాల్లో సోమవారం మోస్తరు వర్షం పడింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు 14.9 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు అన్ని మండలాల్లోనూ వర్షం పడింది. ఇక బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 మండలాల్లో మోస్తరు నుంచి చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా మోతె మండలంలో 2.0 మి.మీ, చివ్వెంలలో 1.0 మి.మీల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఇప్పుడిప్పుడే వరద పారుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
మెట్ట పంటలతో పాటుగా..
సూర్యాపేట జిల్లాలో ఈ వానాకాలం 90 వేల ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 50వేల ఎకరాల్లో సాగైంది. ఇతర మెట్టపంటలైన కంది, పెసర 5వేల వరకు ఉన్నాయి. ఇక అత్యధికంగా సాగయ్యే వరి 80వేల ఎకరాల వరకు వరి నారుతో పాటు నాట్లు పడ్డాయి. అయితే నెలన్నరగా వర్షాభావ పరిస్థితులతో పత్తి, కంది, పెసర పంటల్లో ఏ మాత్రం ఎదుగుదల లేకుండా పోయింది. బోరుబావుల కింద వరి సాగు చేయాలనుకున్న రైతులకు ఒక మడి సైతం తడిచేలా లేకుండాపోయింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలు ఈ పంటలన్నింటికీ ఊపిరి పోసినట్లయింది. పత్తిలో కలుపుతీతతో పాటు ఎరువులు వేసే పనులను రైతులు మొదలు పెట్టారు. అలాగే వరి సాగు చేసే రైతులకు ఈ వర్షాలు ఊరట కలిగించాయి.
ఫ రెండు రోజులుగా మోస్తరు వర్షాలు
ఫ పత్తితో పాటు వరి పైరుకు మేలు
ఫ వ్యవసాయ పనులు ముమ్మరం

పంటలకు జీవం