
బీజేపీ విధానాలను ప్రతిఘటించాలి
సూర్యాపేట అర్బన్: దేశంలో సామాజిక ఉద్యమాలను అణిచివేస్తున్న మనువాద బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులకు రెండో రోజైన బుధవారం ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో ఏనాడూ పార్లమెంట్‌లో దళితుల గురించి చర్చ చేయలేదన్నారు. దళితులు, మహిళలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులు సంపద సృష్టిస్తే దానిని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతోందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్.. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేక దళితులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు విద్య, వైద్యం పేద ప్రజలకు అందడం లేదన్నారు. దళితులు విద్యకు దూరమవుతున్నారని, వైద్యం ఖరీదైన వ్యాపారంగా మారిపోయిందన్నారు.
తాడోపేడో తేల్చుకోవడానికి పోరాటం
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి తో తాడోపేడో తేల్చుకోవడానికి పోరాటాలకు సన్నద్ధం కావాలని జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రతి గ్రామంలో దళిత, గిరిజన వాడల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఉద్యమం చేయాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో భారత సమాజ పరిణామ క్రమంపై ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర నాయకులు బండారు రమేష్, మతం మతోన్మాదం ప్రతిఘటన పద్ధతులపై ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ బోధన చేశారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి కోట గోపి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పాలడుగు నాగార్జున, నందిపాటి మనోహర్, సురేష్ కుమార్, ప్రకాష్ కారత్, బోట్ల శేఖర్, మంద సంపత్, ఏపీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మరి నాగేశ్వరరావు, జిల్లా ఆఫీస్ బేరర్స్ టేకుల సుధాకర్, దేవరకొండ యాదగిరి, దుర్గారావు, పిండిగ నాగమణి, ఇరుగు రమణ,వెంకటరమణ, నందిపాటి సైదులు, ప్రజా సంఘాల నాయకులు పోలిశెట్టి యాదగిరిరావు, వేల్పుల వెంకన్న,జె.నరసింహారావు, వీరబోయిన రవి, వల్లపుదాసు సాయికుమార్, మనోజ్ పాల్గొన్నారు.
ఫ కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ
ఫ రెండో రోజు కొనసాగిన కేవీపీఎస్
రాష్ట్ర సామాజిక శిక్షణ తరగతులు