
ఉమ్మడి జిల్లాలో 60 రోడ్ల అభివృద్ధికి అనుమతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ (హామ్) పథకం కింద 60 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. పనులను రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్లగొండ– 1 పరిధిలో 223.12 కిలోమీటర్ల పొడవున 18 రోడ్లను రూ.302.45 కోట్లతో విస్తరణ అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. అలాగే నల్లగొండ–2 పరిధిలో 314.66 కిలోమీటర్ల పొడవున రూ.320.80 కోట్లతో 26 రోడ్లను అభివృద్ధి విస్తరణ పనులను చేపట్టనుంది. యదాద్రి భువనగిరి జిల్లాలో 287.50 కిలోమీటర్ల పొడవున రూ.389.73 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
ఓయూ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రామగిరి(నల్లగొండ): ఉస్మానియా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషి యాలజీ, ప్రభుత్వ పాలనాశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, సైకాలజీ, ఎంకాం, ఎమ్మెస్సీ గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతోపాటు ముప్పై కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, తొమ్మిది రకాల డిప్లొమా కోర్సులు, యోగాలో సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 15 సెప్టెంబర్ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు www.oucde.net వెబ్‌సైట్‌తోపాటు సెల్ : 9398673736, 9866977741 నంబర్లను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు.
10.31 కోట్ల మంది.. ఉచిత బస్సు ప్రయాణం
రామగిరి(నల్లగొండ): మహాలక్ష్మి పథకం కింద నల్లగొండ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 10,31,28,640 మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా ఆర్టీసీకి రూ.502 కోట్ల ఆదాయం సమకూరింది. దేవరకొండ డిపో పరిధిలో 1.96 కోట్ల మంది, నల్లగొండ పరిధిలో 1,53,52,391 మంది, మిర్యాలగూడ పరిధిలో 1,54,85,729 మంది, నార్కట్‌పల్లి డిపో పరిధిలో 36,25,576 మందితో నల్లగొండ జిల్లాలో మొత్తం 5,44,0 9149 మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారు. అలాగే సూర్యాపేట డిపో పరిధిలో 2.10కోట్లమంది, కోదాడ డిపో పరిధిలో 1.25 కోట్లతో కలిపి సూర్యాపేట జిల్లా మొత్తంగా 3.35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. ఇక, యాదాగ్రి భువనగిరి జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట డిపో పరిధిలో 1,54,25,000 మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.
జ్వర సర్వే నిర్వహించాలి
గరిడేపల్లి: వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించి సకాలంలో నివేదిక పంపించాలని జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి కోటిరత్నం సూచించారు. బుధవారం గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీసీసీఎం లతీఫ్, ఐఎల్‌ఆర్ టెక్నీషియన్ నరేష్, మండల వైద్యాధికారి నరేష్, యశోద, కృష్ణ, ఉపేందర్, కృష్ణకుమారి పాల్గొన్నారు.
గరిష్ట నీటిమట్టానికి
చేరువలో ‘మూసీ’
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూ గరిష్ట స్థాయికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 1,799 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం (4.66 టీఎంసీలు) గల మూసీ ప్రాజెక్టు బుధవారం సాయంత్రం నాటికి 643 (3.91 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు కుడి కాల్వకు 262 క్యూసెక్కులు, ఎడమ కాల్వ కు 307 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.