
రోగులతో మర్యాదగా వ్యవహరించాలి
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు వివిధ విభాగాల గదులను పరిశీలించారు. రోజుకు ఎంతమంది గర్భిణులు వస్తున్నారు.. వారిని రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారో లేదో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, గర్భిణులతో పాటు వచ్చే సహాయకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గర్భిణులకు వైద్య సేవలు బాగా అందుతున్నాయి కానీ ఎంసీహెచ్ సిబ్బంది పేషెంట్లతో అమర్యాదగా వ్యవహరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి గర్భిణులను మెడికల్ చెకప్ కోసం తీసుకొచ్చిన గిరినగర్‌కు చెందిన ఆశా కార్యకర్తలు పారిజాతం, ఆదిలక్ష్మితో కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గర్భిణుల వార్డును పరిశీలించారు. సాధారణ కాన్పులో తనకు బాబు పుట్టాడని చెరుకుపల్లి నుంచి వచ్చిన రమాదేవి అనే మహిళ సంతోషంగా కలెక్టర్‌కు తెలిపింది. గర్భిణులను జనరల్ చెకప్ కు తీసుకువచ్చే ఆశా కార్యకర్తల కోసం అన్ని సదుపాయాలతో ఉన్న ఒక విశ్రాంతి గదిని కేటాయించాలని హెచ్‌ఓడీని ఆదేశించారు. పేషెంట్లతో వచ్చిన సహాయకుల విశ్రాంతికి తాత్కాలిక షెడ్డు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని పరిశీలించారు. ఈ విభాగం సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ ను పరిశీలించారు. ఆ తర్వాత బీఎస్సీ నర్సింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. నర్సింగ్ కాలేజీతో పాటు హాస్టల్‌లో వసతుల కల్పనకు కలెక్టర్ లక్ష రూపాయలు మంజూరు చేశారు. అలాగే స్పోర్ట్స్‌కిట్ మంజూరు చేశారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ శ్రీకాంత్, గైనకాలజీ హెచ్‌ఓడీ పద్మజ, నర్సింగ్ సూపరింటెండెంట్ రేణుక బాయి, డాక్టర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ సూర్యాపేట ప్రభుత్వ జనరల్
ఆసుపత్రి తనిఖీ

రోగులతో మర్యాదగా వ్యవహరించాలి