10 నుంచి సీపీఎం శిక్షణ తరగతులు
సూర్యాపేట : ఈ నెల 10, 11, 12 తేదీల్లో హుజూర్‌నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జరిగే సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలోని పట్టణంలోని ఎంవీఎన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు మూడు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. ఒకపక్క పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతూ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోపక్క ఈ దేశ పౌరులైన మావోయిస్టులపై మారణ హోమం సృష్టించడం దారుణమన్నారు. శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.


