దరఖాస్తుల ఆహ్వానం
నడిగూడెం : సూర్యాపేట జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఈ నెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ జిల్లా సమన్వయకర్త సీహెచ్.పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇమామ్‌పేట గురుకుల పాఠశాలలో జూనియర్ లెక్చరర్లు ఇంగ్లిష్, గణితం పోస్టులకు, జాజిరెడ్డిగూడెం పాఠశాలలో గణితం, తుంగతుర్తి గురుకుల కళాశాలలో ఎకనామిక్స్, పీజీటీ ఇంగ్లిష్, పీజీటీ గణితం, పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని, అలాగే బీఈడీ కూడా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఇమామ్‌పేట గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
బకాయి వేతనాలు
చెల్లించాలి
సూర్యాపేటటౌన్ : పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, కె.వేణు కోరారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో నియమితులైన పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ డీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ అశోక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒకటి రెండు రోజుల్లో జీతాలు చెల్లించడానికి ప్రయత్నం చేస్తామని డీఈఓ హామీ ఇచ్చినట్టు తెలిపారు.
సమస్యల పరిష్కారానికే సదస్సులు
హుజూర్‌నగర్ : భూ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు తెలిపారు. బుధవారం హుజూర్‌నగర్‌లోని టౌన్‌హాల్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు తమ సమస్యలపై దరఖాస్తు అందజేస్తే వాటిపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఆర్‌ఐలు గాలి శ్రీను, షరీఫ్, అధికారులు పాల్గొన్నారు.
ఎన్జీ కాలేజీ
డిగ్రీ ఫలితాలు విడుదల
రామగిరి(నల్లగొండ) : ఎన్జీ కాలేజీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల ఫలితాలను బుధవారం ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బత్తిని నాగరాజు ఫలితాలను విశ్లేషించారు. బీబీఏ, బీకామ్ విభాగాల్లో అత్యధికంగా 87 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని.. చివరి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థుల్లో బీబీఏ 83శాతం, బీకామ్ 80 శాతం, బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులు 69శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవికుమార్, అడిషన్ సీఓఈ డాక్టర్ వైవి.ప్రసన్నకుమార్, అధ్యాపకులు కోటయ్య, చంద్రయ్య, నాగరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల తరహాలో యాదగిరి క్షేత్రం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆలయంలోని వివిధ విభాగాలు, శాఖల అధికారులతో బుధవారం కొండపై గల అతిథిగృహంలో సమావేశం అయ్యారు. ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. పెండింగ్ పనులు, జరగాల్సిన అభివృద్ధిపై చర్చించారు.
దరఖాస్తుల ఆహ్వానం


