గొట్టా.. | - | Sakshi
Sakshi News home page

గొట్టా..

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

హిరమండలం:

గొట్టా బ్యారేజీ యాప్రాన్‌ నిర్మాణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. జనవరిలో నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ జూన్‌ సమీపిస్తున్నా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. జూలైలో కాలువల ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పనులు ప్రారంభించకపోవడంతో ఈ ఏడాది యాప్రాన్‌ నిర్మాణ పనులు పూర్తవుతాయా? లేదా? అన్నది అనుమానమే.

దశాబ్దాల కిందట గొట్టా బ్యారేజీ నిర్మాణం జరిగింది. 1977లో నిర్మించిన ఈ ప్రాజెక్టు జిల్లాను సస్యశ్యామలం చేస్తూ వస్తోంది. అయితే బ్యారేజీకి ఆయవు పట్టుగా ముందు భాగంలో యాప్రాన్‌ (రాతికట్టు) అస్తవ్యస్తంగా మారింది. గేట్ల ద్వారా విడుదలయ్యే నీటి ప్రవాహాన్ని ఇది నియంత్రిస్తుంది. అలాంటి రాతికట్టు అస్తవ్యస్తంగా మారింది. భారీ నీటి ప్రవాహానికి పూర్తిగా దెబ్బతింది. భారీ బండరాళ్లు తేలిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో బ్యారేజీకి ముప్పు తప్పదని నీటిపారుదల శాఖ అధికారులు భావించి ప్రభుత్వానికి నివేదించారు.

డ్రాయింగ్స్‌ సమర్పణలో జాప్యం

ఇక్కడ యాప్రాన్‌ పునర్నిర్మాణానికి గాను జనవరి లో రూ.16.49 కోట్లు మంజూరు చేశారు. కానీ దీని నిర్మాణానికి సంబంధించి డ్రాయింగ్స్‌ సమర్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాలా జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. దాని ప్రభా వం పనుల ప్రారంభంపై పడింది. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన వెంటనే చీఫ్‌ ఇంజినీర్‌ సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌కు డ్రాయింగ్‌ అప్రూవల్‌ పంపాలి. అది మంజూరయ్యాక టెండర్లు ఖరారు చేయాలి. కానీ అలా చేయలేదు. పాత డ్రాయింగ్‌ ప్రకారం టెండర్లను ఆహ్వానించేశారు. కానీ ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టు యాప్రాన్‌ నిర్మాణం జరగకపోతే ఇబ్బందులు వస్తావని చెప్పి మళ్లీ కొత్త డ్రాయింగ్‌తో అప్రూవల్‌కు పంపారు. ఇదంతా జిల్లా మంత్రి ఆదేశాలతో జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు నాలుగు నెలల సమయం పట్టింది. ఇటీవల పనులు ప్రారంభించారు. మూడు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కానీ జూలైలో ఖరీఫ్‌నకు తాగునీరు విడుదల చేయాలి. మరోవైపు వర్షాలు ప్రారంభమైతే యంత్రాలతో పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది.

పనులు చాలా కష్టం

ఈ యాప్రాన్‌ దాదాపు 45 మీటర్ల పొడవు ఉంటుంది. మధ్యలో భారీ బండరాళ్లు తేలిపోయాయి. వా టిని యంత్రాలతో తొలగించాలి. కాంక్రీటుతో పటి ష్టం చేయాలి. రెండు వరసల్లో ఉన్న బ్లాక్స్‌ తొలగించి అడ్డుగా గోడ కట్టాలి. మధ్యలో మళ్లీ రాళ్లు పేర్చా లి. ఇదంతా చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. అది కూడా వాతావరణం సహకరిస్తేనే. ఈ పనుల పేరు చెప్పి బ్యారేజీలో ఉన్న నీటిని బయటకు వదిలేశారు. డెడ్‌ స్టోరేజీకి చేర్చారు. కనీస సమాచారం ఇవ్వకుండా అప్పట్లో అలా చేయడంతో రబీ పంటలు వేసుకున్న వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు వేసుకొని పెట్టుబడులు పెట్టిన తర్వాత నీటిని వృథాగా కిందకు విడిచిపెట్టడంతో రైతులు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఖరీఫ్‌కు కూడా యాప్రాన్‌ నిర్మాణం పేరుతో నీటి విడుదలను జాప్యం చేస్తారన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. ఒకవేళ సగం పనులు పూర్తయిన తర్వాత వర్షాలతో నిలిచిపోతే మాత్రం నిధులంతా బూడిదలో పోసిన పన్నీరు కాక తప్పదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గొట్టా బ్యారేజీ యాప్రాన్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం

జనవరిలో రూ.16.49 కోట్ల నిధుల విడుదల

పనులు మాత్రం మే రెండో వారంలో ప్రారంభం

జూలైలో వంశధార నీటి విడుదల సాధ్యమేనా?

రానున్నది వర్షాకాలం.. పనులపై నీలినీడలు

Advertisement
 
Advertisement
Advertisement