పుష్కరిణి పనులపై పర్యవేక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

పుష్కరిణి పనులపై పర్యవేక్షణ కరువు

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. రాష్ట్ర దేవదాయ శాఖ ఆదేశాల మేరకు రూ.4 కోట్ల (రూ.2 కోట్లు ఆలయ నిధులు, రూ.2 కోట్లు సీజీఎఫ్‌ నిధులతో) ఇంద్రపుష్కరిణి ఆధునీకరణ అభివృద్ధి కోసం టెండర్లు ఖరారు కావడం విదితమే. అయితే రెండు నెలల నుంచి జరుగుతున్న ఈ పనుల్లో నాణ్యత పరిశీలనకు సంబంధిత దేవదాయ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం లేదు. ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.వి. ప్రసాద్‌ కూడా ఇటీవల కాలంలో పలు కారణాలతో సెలవులో వెళ్లిపోతుండటంతో నిర్మాణ పనుల్లో ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కనీసం పనులు జరుగుతున్న సమయంలో ఏఈలు గానీ, డీఈలు గానీ మచ్చుకై నా కనిపించడం లేదు. కూటమి నేతల అండదండలతో సబ్‌ కాంట్రాక్టులు దక్కించుకున్న వారు సైతం అధికారుల వైపు చూడకుండా తమదైన శైలిలో కాంక్రీట్‌ వర్క్‌, పుష్కరిణి చుట్టూ ప్రధాన గోడను కూడా నిర్మించేశారు. రూ.4 కోట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సి ఉండగా..ఇప్పటికి ఎర్త్‌ వర్కులు మాత్రమే జరుగుతున్నాయి. అయితే మట్టిని కప్పే పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కరిణి అడుగున నింపే మట్టి కూడా ఎలాంటి పర్యవేక్షణ పరీక్షలు లేకుండానే వందలాది లోడ్లతో ట్రిప్పర్లతో కప్పేస్తున్నారు. టెండర్‌ నిబంధనల ప్రకారం వీటితో పాటు ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలోనే కాంక్రీట్‌ వర్కులు జరగాల్సి ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాణ్యత లోపాలతో పుష్కరిణి నిర్మాణం పూర్తయితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement