సరళ జీవనం.. ఉన్నత చింతనం | - | Sakshi
Sakshi News home page

సరళ జీవనం.. ఉన్నత చింతనం

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

జీవిత లక్ష్యంపై అవగాహన

మనిషి జీవిత లక్ష్యంపై అవగాహన కల్పించడమే కృష్ణచైతన్యం. వర్ణాశ్రమ కళాశాలలో బతుకుదెరువు, వృత్తి కళలపై శిక్షణనిస్తున్నాం. నెల రోజుల పాటు వేసవి శిబిరాలు కొనసాగుతాయి. సనాతన ధర్మ విస్తరణ, ప్రకృతి ప్రసాదిత సమాజమే లక్ష్యం. గుజరాత్‌, పంజాబ్‌, కర్నాటక, తమిళనాడులో కూర్మలాంటి గ్రామాలను నెలకొల్పాం. హంగేరిలో అయితే 800 ఎకరాల విస్తీర్ణంలో గ్రామం విస్తరిస్తోంది. చెక్‌ రిపబ్లిక్‌లోనూ ఒక పల్లె ఉంది. సనాతన వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం మా ఈ ప్రయత్నం. – నటేకర్‌ నరోత్తమదాస్‌,

వర్ణాశ్రమ బోధకుడు, కూర్మ గ్రామం

హిరమండలం: ఎరువులు వాడని పంటలు, సిమెంట్‌ వాడని గృహాలు, విద్యుత్‌ వాడని మనుషులు, హడావుడి లేని బతుకులు.. వెరసి కూర్మ గ్రామం. ఉన్నత చదువులు, కొలువులు సాధించిన వారే మార్గాన్ని అనుసరిస్తూ ప్రపంచానికి సరికొత్త బాట చూపుతున్నారు. హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపిస్తుంది ఈ గ్రామం. కృష్ణ చైతన్య సమాజం పేరుతో 2018లో కూర్మ గ్రామం ఏర్పాటైంది. ప్రస్తుతం కూర్మ గ్రామంలో యువతకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికతో పాటు ప్రకృతి ప్రసాదించే సమాజం కోరుకునే యువతకు ఇక్కడ నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

అన్నీ సొంతంగానే..

కూర్మ గ్రామంలో 80 మంది వరకూ నివాస ముంటున్నారు. 20 వరకూ గృహస్తు జీవన కు టుంబాలు ఉన్నాయి. ఓ 20 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు బ్రహ్మచర్యం గడుపుతున్నారు. సరళ జీవనం, ఉన్నత చింతనం వీరి విధానం. మనిషికి నిత్యావసరాలుగా భావించే కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తున్నారు కూర్మ గ్రామస్తులు. ప్రకృతి సేద్యంతోనే వీటిని సంపాదించుకుంటున్నారు. ఏడాదిలో వీరికి అవసరమైన వందలాది బస్తాల ధాన్యాన్ని పండిస్తుంటారు. టన్నుల కొద్దీ కూరగాయలను సాగుచేస్తున్నారు. అక్కడ గృహస్తులతో పాటు విద్యార్థులు, ఏడాది పొడవునా ఇక్కడకు వచ్చే భక్తులకు వాటితోనే ఆహారం తయారు చేసి అందిస్తుంటారు. విత్తు విత్తింది మొదలు కోతల వరకూ ఎవరిపైనా ఆధారపడరు. దంపుడు బియ్యాన్ని మాత్రమే వండుకుంటారు. వారి దుస్తులను వారే తయారుచేసుకుంటారు. వారే నేత కార్మికులుగా మారిపోతారు. ఇళ్లకు వారే మేసీ్త్రలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మెంతులు, కరక్కాయలు, మినుములు మిశ్రమంగా చేసి గానుగ ఆడిస్తారు. గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో కలిపి ఇళ్లు కట్టుకున్నారు. కుంకుడు కాయ రసంతోనే దుస్తులను ఉతుక్కుంటారు. సనాతన ధర్మం, వైదిక సంస్కృతి, వర్ణశ్రామ విధాన పునఃస్థాపన లక్ష్యంగా చెబుతుంటారు.

వర్ణాశ్రమ విద్య..

ఇక్కడ విద్యార్థులు వర్ణాశ్రమ విద్యను అభ్యసిస్తుంటారు. పూర్వపు గురుకులాల తరహాలో ఇక్కడ వాతావరణం ఉంటుంది. విద్యార్థులు సంస్కృతం, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. వయసు, ఆసక్తిని బట్టి చేతివృత్తులపై శిక్షణనిస్తారు. వేకువజామున 4.30 గంటలకు దైవానికి హారతితో వీరి దినచర్య ప్రారంభం అవుతుంది. ఉదయం భజన, ప్రసాదం స్వీకరణ తర్వాతే రోజువారి పనులకు వెళతారు. యాంత్రిక జీవితంతో మనుషులు యాంత్రికంగా మారుతారనే ఉద్దేశంతో వీరు సహజంగా బతికేందుకు మొగ్గు చూపుతున్నారు.

కూర్మ గ్రామంలో శ్రమైక జీవన సౌందర్యం

యువతకు వేసవి శిక్షణ శిబిరాలు

ఈ నెల 30 నుంచి మే 20 వరకు నిర్వహణ

ఏటా యువతకు శిక్షణ..

ప్రకృతి సమాజాన్ని విస్తరించాలని.. సనాతన ధర్మం వైపు ఈ సమాజం అడుగులు వేయాలని భావించి ఏటా యువతకు ఇక్కడ వేసవి శిబిరా లు ఏర్పాటుచేస్తున్నారు. నెలరోజుల పాటు చేతి వృత్తులు, పురాతన జీవన విధానం, సనాతన ధర్మం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. తద్వారా సమాజం కొంతవరకైనా వికసిస్తుంద న్నది ఒక ఆశ. అందులో భాగంగానే ఈ నెల 30 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యా యి. వర్ణాశ్రమ కళాశాలలో ఈ శిబిరాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. చేనేత మగ్గం, మట్టికుండల తయారీ, వడ్రంగి, కర్రసాము, నూనెగానుగ, సున్నం గానుగ, వైదిక గృహ నిర్మాణం, ప్రకృతి వ్యవసాయం, గోసంరక్షణ, ఆయుర్వేదం వంటి వాటిపై ఇక్కడ శిక్షణ ఇ స్తారు. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల శిక్షణ కూడా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement