న్యూస్‌రీల్
తల్లిడిల్లిన ఉద్దానం
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఈ తల్లి భుజాలపై ఉన్నది కన్నీటి కుండ. ఉద్దానంలో ప్రతి ఇంటికీ వద్దన్నా వస్తున్న శాపమిది. శ్మశానాల్లో ఈ మట్టి కుండలు, ఊరిలో తల్లుల గుండె లు ఉద్దానంలో దశాబ్దాలుగా పగులుతూనే ఉన్నాయి. బూర్జపాడులో 15 ఏళ్ల పిల్లాడు బుంగ యోగి కిడ్నీ వ్యాధితో బుధవారం కన్నుమూశాడు. వ్యాధి ఉందని తెలిసి ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, పుస్తె తాకట్టు పెట్టి చికిత్స చేసినా లాభం లేకపోయింది. పిల్లాడి ఆయుష్షు ఆగిపోయింది. తండ్రి కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. కన్న కొడుకు చనిపోయాడని తెలిసినా అంత్యక్రియలకు రాలేని దీనావస్థ ఆయనది. కట్టుకున్న వాడు పక్కన లేక, కడుపున పుట్టిన వాడికి ప్రాణం లేక ఆ తల్లి పడిన వేదన ఊరందరినీ కదిలించింది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన కొడుకు అంత్యక్రియలు తన చేతులమీదుగా చేయాల్సి రావడంతో ఆ అమ్మ గుండె ముక్కలైంది. ఏం చెబితే ఆ తల్లి గుండెలో బాధ తగ్గుతుంది. ఏం చేస్తే ఆ కన్నీటి వరద ఆగుతుంది. ఉద్దానంలో వీధివీధినా వినిపించే కథలివి. ఆ జాబితాలోకి ఇప్పుడు యోగి పేరు కొత్తగా పేరు చేరింది. – ఇచ్ఛాపురం రూరల్


