● అకాల వర్షాలతో పంట నేలపాలు
● తీవ్రనష్టం వాటిళ్లిందని ఆవేదన
● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
జి.సిగడాం: ఇటీవల కురిసిన అకాల వర్షానికి అరటి పంట సాగు చేసిన రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందనే నమ్మకంతో రైతులు అరటి పంటపై దృష్టి సారించారు. ఈ పంట సాగు చేసుకుంటే ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుందన్న నమ్మకంతో సాగు చేస్తున్నారు. అయితే ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో అకాల గాలి వానల వలన రైతులకు తీవ్రనష్టం వాటిళ్లింది. ఈనెల 6వ తేదీన కురిసిన గాలి వానలకు వెంకయ్యపేట, రాజులపేట, ఎల్లయ్యపేట, పున్నాం, ఉల్లివలస, ఎల్లయ్యపేట గ్రామాల్లో సుమారుగా 70 ఎకరాల్లో అరటి పంట నేల పాలయ్యింది. ఎకరాకు సుమారుగా రూ.80 వేల వరకు మదుపులు పెట్టామని రైతులు వాపోతున్నారు. పంట చేతికొస్తున్న సమయంలో ఇటువంటి నష్టం రావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
జి.సిగడాం మండలంలో...
మండలం పరిధిలోని వెంకయ్యపేట, పున్నాం పంచాయతీల్లో ఉల్లివలస, నాయుడువలస, ఎల్లయ్యపేట, బూటుపేట, పున్నాం గ్రామాల్లో సుమారుగా 80 ఎకరాల్లో అరటి పంటసాగు చేస్తున్నారు. భారీ ఈదురు గాలుల వలన 80 శాతం వరకు అరటిపంటకు నష్టం వాటిళ్లింది. మిగతా 20 శాతం పంటను కాపాడేందుకు అరటి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వెంకయ్యపేట గ్రామానికి చెందిన గల్లా కృష్ణ, రాములు, ఉల్లివలస గ్రామానికి చెందిన మామిడి బలరాం, ముంగి రామకృష్ణ, ముంగి చిన్నారావు, అల్లింగి పార్వతి, గొండు సాంబమూర్తి, కాకర్లపూడి రామకృష్ణంరాజు, నడిమిపిల్లి సీతారాం రాజులతోపాటు పలువురు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి అందాల్సిన పంట ఇలా గాలివానల వలన నేల పాలవ్వడంతో గగ్గోలు పెడుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
కష్టపడి పండించిన అరటి పంట ఆకాల గాలులు, వర్షం వలన పూర్తిగా నేలమట్టమైంది. సుమారుగా ఎకరాకు రూ.50 వేల వరకు మదుపులు పెట్టాం. చేతికి అందాల్సిన ఫలసాయం అందలేదు. ప్రభుత్వం అరటి రైతులను ఆదుకోవాలి.
– మామిడి బలరాం, అరటి రైతు, ఉల్లివలస
అప్పులు చేసి సాగు చేశాం
వేలాది రూపాయులు అప్పులు చేసి ఈ ఏడాది అరటి పంట సాగు చేశాం. ఇటీవల వీచిన గాలులకు పంటంతా నేలమ ట్టంఅయ్యింది. ఇప్పటికే సుమా రుగా రూ.1 లక్ష వరకు మదుపు పెట్టాను. ఇలా అయితే రైతు బతకడం చాలా కష్టం. ప్రభుత్వం అరటి రైతులను ఆదుకోవాలి.
– గల్లా కృష్ణ, అరటి రైతు, వెంకయ్యపేట


