తీసుకున్నారా..? | - | Sakshi
Sakshi News home page

తీసుకున్నారా..?

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

● మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అత్యంత కీలకం ● రిజిస్ట్రేషన్‌తో సర్టిఫికెట్‌ జారీ

సర్టిఫికెట్‌ వల్ల

ఉపయోగాలు

90 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ..
● మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అత్యంత కీలకం ● రిజిస్ట్రేషన్‌తో సర్టిఫికెట్‌ జారీ

ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్‌లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్‌ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్‌పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్‌లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్‌ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకొని సర్టిఫికెట్‌ పొందితే వారికే మంచిది.

పాస్‌పోర్టు అప్లికేషన్‌, బ్యాంక్‌ జాయింట్‌ అకౌంట్‌, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్‌ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్‌, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివా లయం లేదా మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్‌ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్‌ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజిస్ట్రేషన్‌ అధికారి పరిశీలించి సర్టిఫికెట్‌ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి.

పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్‌, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి.

యు.ఉపేంద్ర, జనన,మరణ, రిజిస్ట్రేషన్‌ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement