కంచిలి: మండలంలోని మంగళవారం కురిసిన వడగళ్ల వర్షానికి ఉద్యాన పంటలకు నష్టం ఏర్పడింది. ఇందులో మండలంలో కుత్తుం, కొక్కిలిపుట్టుగ పంచాయతీల పరిధిలో 130 కొబ్బరి చెట్లు నేలకొరిగా యి. అదేవిధంగా బూరగాం, కుత్తుం తదితర గ్రామాల్లో 63 ఎకరాల్లో టమాటా పంటకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా జీడిచెట్లు కూడా మండపల్లి, కుత్తుం, కొక్కిలిపుట్టుగ పంచాయతీల పరిధి గ్రామాల్లో నేలకొరిగాయి. పంట చేతికి వచ్చిన సమయానికి ఇలా హఠాత్తుగా ప్రకృతి ప్రకోపించడంతో ఉద్యాన పంటలు సాగుచేస్తూ జీవనాధారం పొందుతున్న రైతుల కష్టం వర్షం పాలైందని ఆందోళన చెందుతున్నారు. తమకు ఏర్పడిన నష్టాలపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సర్వేచేసి, తగిన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు.
నష్టాలు పరిశీలన..
మండలంలో ఉద్యాన పంటలకు ఏర్పడిన నష్టాల ను ఉద్యానశాఖ అఽధికారి పి.మాధవీలత బుధవా రం పరిశీలించారు. ఆమె కొక్కిలిపుట్టుగ, కుత్తుం, బూరగాం గ్రామాల్లో పర్యటించారు. బూరగాం, కుత్తుం గ్రామాల్లో సాగుచేస్తున్న టమాటా పంట పొలాలను పరిశీలించారు. ఇక్కడ టమాటా సాగుచేస్తున్న 55 మంది రైతులకు సంబంధించి 63 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. అలాగే పంట పొలాల్లో నీరు నిలువ ఉండకుండా చేసి, బిల్‌టాక్స్ కానీ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారీ చేయమని రైతులకు సూచించారు. అలాగే కుత్తుం, మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ, కొక్కిలిపుట్టుగ గ్రామాల్లో నేలకొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. ఈ గ్రామాల్లో 130 కొబ్బరి చెట్లు నేలకొరిగాయని గుర్తించారు. ఈ నష్టాల వివరాలను నమోదు చేసి, ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు మాధవీలత తెలిపారు.


